కళాశాలలోనే
ప్రత్యేక శిబిరాలు
సత్తెనపల్లి: ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లు నిండిన యువత ముందస్తుగానే ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు అవుతుంది.
మారిన నిబంధనలు...
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం .. కేవలం జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. జనవరి 2న 18 ఏళ్ల నిండినా.. ఓటరుగా నమోదు కావడానికి మరో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చేది. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కీలక సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అందు బాటులోకి తెచ్చింది. జనవరి , ఏప్రిల్ , జూలై , అక్టోబర్ ఒకటో తేదీల్లో పదిహేడేళ్లు నిండి ఉంటే సంబంధిత యువత ఫారం–6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
యువతా మేలుకో..
భారత ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 29వేల మందికి పైగా యువతకు సరికొత్తగా ఓటరుగా మారే అవకాశం లభించనుంది. జిల్లాలోని విద్యా సంస్థల గణాంకాలను పరిశీలిస్తే 2023–24 పదో తరగతి విద్యార్థులు 29,423 మంది. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయసు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు 17 నుండి 18 ఏళ్ల వయసు గ్రూపులోకి వస్తున్నారు. వీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది.
17 ఏళ్లు నిండిన తర్వాత ఓటరుగా నమోదు చేసుకోవడానికి వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువపత్రాలను ఆన్‌లైన్, వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత, అర్హులకు ఓటు హక్కు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ, సదరు యువతకు 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ఈ సరికొత్త విధానంపై అవగాహన పెంచడానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోనే ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.


