ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించండి

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

భూ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోండి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించండి డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు..

రూ.లక్ష తీసుకొని కట్టడం లేదు

బస్‌ షెల్టర్‌ నిర్మిస్తామంటే స్థలం ఇవ్వట్లేదు

నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో 153 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్‌ ద్వారా మూడు డివిజన్‌లకు చెందిన ఆర్‌డీఓలు 35 అర్జీలు స్వీకరించారు. వచ్చిన వాటిలో అధికంగా సర్వేలో తమ భూముల విస్తీర్ణం తగ్గిందని, నూతన పింఛన్లు, ఇళ్ల పట్టాలు అందజేయాలని, ఇప్పటికే ఇస్తున్న పింఛన్‌ను పెంచి ఇవ్వాలంటూ కొందరు దివ్వాంగులు స్వయంగా కలిసి అర్జీ అందజేశారు. అలాగే డ్వాక్రా సొమ్ము చెల్లించట్లేదని, కన్న పిల్లలు ఆస్తులు రాసిన తర్వాత తమను పట్టించుకోవట్లేదంటూ పలువురు వృద్దులు కలెక్టరేట్‌కు వచ్చారు. కొన్ని సమస్యలు వారి మాటల్లోనే...

మా గ్రామంలో అనాదిగా 63 కుటుంబాలకు చెందిన ఏడెకరాల పొలాన్ని రామిశెట్టి సైదారావు కబ్జా చేసి తన కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకొని స్వాధీనం చేసుకున్నాడు. అతనికి గ్రామ వీఆర్‌ఓ, సర్వేయరు, ఆర్‌ఐలు సహకరించారు. తహసీల్దార్‌ కూడా మా గోడు పట్టించుకోవట్లేదు. దయచేసి ఆ కబ్డాదారుడు, అతనికి సహకరించిన అధికారులపై విచారణ జరిపి మాకు న్యాయం చేయండి.

–బట్టు సత్యనారాయణ, కోటయ్య,

ఈశ్వరయ్య, కటకం శ్రీనివాసాచారి,

తాళ్లపల్లి, మాచర్ల మండలం

నా కుమార్తె మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ భర్త చేతిలో హత్యకు గురైంది. ఆమెకు మూడేళ్లు, ఒక సంవత్సరం వయస్సుగల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వయస్సు పైబడిన వారి తాత, అమ్మమ్మలు ఆ పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నారు. అక్క కుమారుడు ఆ బాధ్యతలు స్వీకరించాడు. అందువలన అతనికి ఉద్యోగం ఇప్పించి న్యాయం చేయండి.

–తొరటి కోటేశ్వరమ్మ,

ప్రకాష్‌నగర్‌, నరసరావుపేట

నా భార్య ప్రసవించిన నాలుగు రోజులకే అనారోగ్యంతో నరసరావుపేట నుంచి గుంటూరుకు తరలిస్తుండగా చనిపోయింది. డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని గుంటూరు జీజీహెచ్‌ను కోరితే తాము కాదు ఇచ్చేది మీ ప్రాంతంలోనే తీసుకోవాలని చెప్పారు. దాని కోసం మా ఊరు చీమలమర్రి పంచాయతీ, నరసరావుపేట లింగంగుంట్ల పంచాయతీ, మున్సిపల్‌ అధికారులను కలిసినా మేము కాదంటే మేము కాదని సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు.

–టి.వెంకటేశ్వర్లు,

చీమలమర్రి, నకరికల్లు మండలం

మేము మూడేళ్ల కిందట అబ్దుల్‌ బాషా డ్వాక్రా గ్రూపుపై పదిమందిని కలిసి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాం. మాలో మున్నీసా అనే మహిళ తన వంతు రూ.లక్ష తీసుకొని తిరిగి బ్యాంకుకు చెల్లించకుండా వెళ్లిపోయింది. బ్యాంకు వారు ఆ డబ్బును కూడా మమ్మల్ని కట్టమంటున్నారు.

–షేక్‌ నూర్జహాన్‌, కరిమున్నీసా,

ఇస్లాంపేట, నరసరావుపేట

మా గ్రామంలోని సాయిబాబా గుడి పక్కగా బ్రిడ్జికి సమీపంలో ప్రయాణికుల కోసం బస్‌షెల్టర్‌ నిర్మిద్దామని ఆర్‌అండ్‌బీ అధికారులను కలిస్తే అంగీకారం తెలుపలేదు. ఇప్పటికే అనధికారికంగా పట్టలతో ఏర్పాటుచేస్తే ప్రయాణికులు ఎండవేడికి ఉపయోగించుకుంటున్నారు. అధికారికంగా ఉత్తర్వులు ఇస్తే నా సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తాను.

–మద్దూరి రామకోటిరెడ్డి,

సొలస, యడ్లపాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement