వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Jul 14 2026 1:42 AM | Updated on Jul 14 2026 1:42 AM

సత్తెనపల్లి: వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సత్తెనపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని 21వ వార్డుకు చెందిన ఆలేటి జయబాబు పురుగు మంది తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు హుటాహుటిన పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, పట్టణ సీఐ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

బైక్‌ ఢీకొని వృద్ధురాలు మృతి

చిలకలూరిపేటటౌన్‌: మండలలలోని జాతీయ రహదారి–16పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొప్పూడి గ్రామానికి చెందిన కోడూరు వెంకటరమణమ్మ (65) దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బొప్పూడి గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం 8 గంటలకు పొగాకు కంపెనీకి కూలీ పని నిమిత్తం బయలుదేరింది. చిన్న పసుమర్రు గ్రామం సమీపంలోని చీరాల ఓడరేవుకు వెళ్లే హైవే వంతెన కింద రహదారిని దాటుతుండగా, ఒంగోలు వైపు వెళ్ను ద్విచక్ర వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణమ్మతో పాటు, బైక్‌ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేటలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణమ్మ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. నాదెండ్ల మండలం గణపవరంకు చెందిన మృతురాలి కుమార్తె బత్తినేని శేషమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

‘సర్‌’ గడువును పొడిగించాలి

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కోరిన సీపీఐ నాయకులు

నరసరావుపేట: జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్‌ హుస్సేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ గడువును మరో మూడు నెలలపాటు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న సర్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్నాయని తెలిపారు. మరణించినవారి పేర్లు, నకిలీ ఓటర్లను తొలగించడం అవసరమే అయినప్పటికీ, ఆ పేరుతో నిజమైన ఓటర్ల హక్కులు దెబ్బతినకూడదన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉలవలపూడి రాము మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ద్వారా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన వారికి కూడా సరైన సమాచారం అందడం లేదని, సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుల స్థితి తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. చాలా చోట్ల బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్‌ సుభాని, సీహెచ్‌.సత్యనారాయణరాజు, మహంకాళి సుబ్బారావు, ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్‌ పాల్గొన్నారు.

ఏఎన్‌యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను వెల్లడించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏప్రిల్‌లో నిర్వహించిన ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్‌ పరీక్షలకు 41 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ పరీక్షలకు 22 మందికిగానూ 20 మంది, ఎంఎస్సీ బోటరీ పరీక్షలకు 66 మందికి 38 మంది, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పరీక్షకు 37 మంది 31 మంది ,ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ 26 మందికి 26 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెస్సీ ఎన్విరాల్‌మెంట్‌ సైన్స్‌ పరీక్షకు 16 మందికి 16 మంది, ఎమ్మెస్సీ ఫుడ్‌ సైన్స్‌, నూట్రీషన్‌ 70 మందికి గాను 70 మంది, ఎమ్మెస్సీ జియాలజీ పరీక్షలకు ఐదుగురు, ఎమ్మెస్సీ సైకాలజీ పరీక్షకు 23 మంది హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement