నివాళులర్పించిన సినీ, నాటక రంగ ప్రముఖులు
యడ్లపాడు: కొండవీటి కళా పరిషత్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్నేని సీతారామాంజనేయులు(58) అనారోగ్యంతో మృతి చెందారు. లింగారావుపాలెం గ్రామంలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కొండవీటి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి నాటికల పోటీలను నిర్వహణను ఆయన చురుగ్గా పర్యవేక్షించేవారు. రెండున్నర దశాబ్దాలుగా కొండవీడు కళాపరిషత్ ప్రతినిధిగా ఉంటూ కళామతల్లికి తనవంతుగా సేవలు అందించారు. హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన యడ్లపాడు మండలం లింగారావుపాలేనికి తరలించగా, నాటక, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అశ్రునయనాల మధ్య నివాళు లర్పించారు.
ఎఫ్‌బీసీ డైరెక్టర్ డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు గుదె పాండురంగారావు, వరగాని కళా పరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, మన సంతానం సీరియల్ డైరెక్టర్ మల్నేని రాధాకృష్ణ, ఆలోకం పెద్దబ్బయ్య, సినీ దర్శకుడు జరుగుల పద్మారావు, రామారావు, జరుగుల శంకర్రావుతో పాటు కొండవీటి కళా పరిషత్ అధ్యక్షుడు కట్టా శ్రీహరి, కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, కట్టా రామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, ముత్తవరపు రామారావు తదితరులు సీతారామంజనేయులు భౌతికదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించగా, అనంతరం గ్రామంలోనే అంత్యక్రియలు అధికారికంగా ముగిశాయి.
ఆయనకు భార్య సుభాషిణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


