నాగార్జున యాదవ్ అరెస్టుకు చంద్రబాబు, లోకేష్‌లే కారణం మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు
నరసరావుపేట: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే తెలంగాణ పోలీసులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేశారని పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్ తెలిపారు. సోమవారం గుంటూరురోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని రెండేళ్లక్రితం టీవీ చర్చలో భాగంగా విమర్శిస్తే ఇప్పుడు అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. అక్కడి ప్రతిపక్ష నాయకులను రోజుకు ఒకసారి చులకనగా మాట్లాడే రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులను ఏం చేయాలని ప్రశ్నించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందనే దానికి నిదర్శనం వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నాగార్జున యాదవ్‌ల అక్రమ అరెస్టులేనన్నారు. వైఎస్సార్‌సీపీ గొంతుకలా నాగార్జునా యాదవ్ వ్యవహరిస్తున్నాడనే కారణంతోనే అతడిని అక్రమ అరెస్టు చేశారన్నారు. ఇటువంటి కేసులకు పార్టీ యువత భయపడపదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాగార్జున యాదవ్‌పై నమోదు చేసిన అక్రమ కేసులపై వైఎస్సార్ సీపీ యువత, విద్యార్థి విభాగం పోరాడుతుందన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పుతాళ్ల వేణుమాధవ్, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు షోయబ్ అక్తర్, జానీబాష, మండల అధ్యక్షుడు శాంతకుమార్, నియోజకవర్గ సోషల్‌మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, నాయకులు పాల్గొన్నారు.


