పిడుగురాళ్ల మండలం కరాలపాడులో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు అధికం గ్రామానికి ఉన్నతాధికారులు వచ్చి వెళ్లిన తర్వాత మందగించిన డిజిటలైజేషన్ ప్రక్రియ కీలకమైన ఆదివారం ఐదుగురికి గానూ ఒక్కరే బీఎల్‌ఓ హాజరు తూతూమంత్రంగా డిజిటలైజేషన్ ప్రక్రియ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
పిడుగురాళ్ల: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)– 2026 కార్యక్రమాన్ని ప్రారంభించి, కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 14తో ముగియనుంది. అయితే కొందరు అధికారుల తీరుతో కార్యక్రమం తీరుతెన్నులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన గ్రామం. ఈ గ్రామంలో 213, 214, 215, 216, 217 నంబర్ల పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ నెల 11వ తేదీవరకు సర్ పక్రియ, డిజిటలైజేషన్ సజావుగా సాగింది. అయితే ఈనెల 11వ తేదీన గురజాల ఆర్డీఓ మురళి, పిడుగురాళ్ల తహసీల్దార్ మధులు కరాలపాడు గ్రామంలోని సచివాలయంలో బీఎల్‌ఓలతో సర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఇక్కడి బీఎల్‌ఓల పనితీరు మారిందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకమైన ఆదివారం రోజున డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇక్కడి ఐదుగురు బీఎల్‌ఓలు హాజరై వేగవంతంగా ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా కేవలం ఒక బీఎల్‌ఓ మాత్రమే హాజరై అది కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చి ఆన్‌లైన్ కార్యక్రమం నామమాత్రంగా నిర్వహించారు. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమంలో అధికారుల ఒత్తిళ్లతోనే బీఎల్‌ఓలు విధులకు దూరంగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమైన ఉన్నతాధికారులు వచ్చివెళ్లిన తర్వాత కింది స్థాయి సిబ్బంది వేగవంతంగా విధులు నిర్వహించి పనులు ముగిస్తారని, కానీ కరాలపాడులో మాత్రం ఉన్నతాధికారులు వచ్చినప్పటి నుంచి ప్రక్రియ నత్తనడకన సాగుతుందని ఆరోపిస్తున్నారు. ● ఈ విషయమై తహసీల్దార్ మధుబాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. కరాలపాడులో బీఎల్‌ఓలు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింత సమాచారం కావాలంటే ఆ గ్రామానికి మండల ఆర్‌ఐ శ్రీనుబాబు ఇన్‌ఛార్జిగా ఉన్నాడని మాట దాటవేశారు. దీంతో ఆర్‌ఐ శ్రీనుబాబును వివరణ కోరగా కరాలపాడులోని ఐదు ఎన్నికల బూత్‌లలో ఇప్పటి వరకు 84 శాతం ఆన్‌లైన్ పక్రియ చేయటం జరిగిందని, కొన్ని ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్ల వద్ద నుంచి సేకరించాల్సి ఉందని, అవి కూడా ఈ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సేకరించి ఆన్‌లైన్ చేస్తామని తెలిపారు.


