సత్తెనపల్లి: యూ ఆకారపు రైల్వే వంతెన వద్దంటూ సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద జాతీయ రహదారిపై కంకణాలపల్లి గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. వెన్నాదేవి గ్రామం, వావిలాలనగర్ (కాందీశీకులు) నుంచి కంకణాలపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వే గేటు వద్ద కొంతకాలం క్రితం అధికారులు అండర్‌పాస్ నిర్మాణానికి ప్రయత్నించారు. తమ ఇళ్లు కోల్పోతామని, అండర్‌పాస్ వద్దని జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు కాందీశీకులు విన్నవించారు. రైల్వే గేటు నుంచి వంద మీటర్ల దూరంలో క్రేన్ తీసుకొచ్చి అండర్ పాస్ నిర్మాణ పనుల ప్రాంరంభానికి గురువారం అధికారులు ప్రయత్నించారు. కంకణాలపల్లి గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. వ్యవసాయ సీజన్‌లో యూ టర్న్ తీసుకుని వాహనాలు రావడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెన్నాదేవి గ్రామంలోని సచివాలయం వద్దకు చేరుకుని కొండమోడు, పేరేచర్ల జాతీయ రహదారిపై వారు బైటాయించారు. గ్రామాన్ని కాపాడాలని, యూ ఆకారపు అండర్ పాస్ వద్దంటూ నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వెన్నాదేవి, కంకణాపల్లి పరిసరాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.


