దాచేపల్లి: సర్ ప్రక్రియలో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో ఎన్యూమరేషన్ ఫారాలు పరిశీలిస్తున్న టీడీపీ నేతల ఫొటోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతలు అప్రమత్తమై నగర పంచాయతీ కమిషనర్ జి. వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతల వద్ద ఈఎఫ్‌లున్న ఫొటోలను సైతం కమిషనర్‌కి అందించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. బీఎల్‌ఓల వద్ద ఉండాల్సిన ఫారాలు సంబంధం లేని టీడీపీ నాయకుల వద్దకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రం అందించిన వారిలో పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందుల జాను, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్‌రెడ్డి, మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల రవికుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్‌హుస్సేన్, పట్టణ ఉపాధ్యక్షుడు కొలా జంపాలరెడ్డి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ సైదా, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు, యుజవన విభాగం అధ్యక్షుడు జక్కా ఆశోక్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గరికపాటి సైదారావు, నాయకులు బొమ్మిరెడ్డి నరసింహారావు, కోలా నరసింహారెడ్డి, షేక్ డాడీ, నట్టు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.


