సత్తెనపల్లి: త్రుటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలోని నలందా ఇంజినీరింగ్ కళాశాల వద్ద గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. కంకణాలపల్లి అజయ్ అనే వ్యక్తికి గాయాలు కావడంతో సత్తెనపల్లి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరో వ్యక్తిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
దాడి ఘటనపై కేసు నమోదు
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కల్వర్టు నిర్మాణానికి సంబంధించి తలెత్తిన వివాదంలో పలువురు వ్యక్తులు దాడిచేసినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సొలస గ్రామానికి చెందిన గువ్వల శ్రీనివాసరావు తన వ్యవసాయ భూమికి వెళ్లేందుకు వీలుగా పాత డ్రైనేజీ కాలువపై జూన్ నెల 27వ తేదీన ఉదయం సిమెంట్ కల్వర్టు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. అదే గ్రామానికి చెందిన గువ్వల భూలక్ష్మి, గువ్వల గోపిలు అక్కడికి చేరుకుని, పనులను అడ్డుకోవడమే కాకుండా వారిపై దుర్భాషలాడారు. తిరిగి అదే రోజు రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో గువ్వల గోపి మరో ఎనిమిది మంది తన ఇంట్లో దౌర్జన్యంగా ప్రవేశించి దాడి చేసినట్లు బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఒక్క మండలంలోనే వర్షం
నరసరావుపేట: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా మందగించాయి. గడిచిన 24గంటల్లో కేవలం అచ్చంపేట మండలంలో మాత్రమే 5.4మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మిగతా 27మండలాల్లో ఎక్కడా వర్షం నమోదు కాలేదు. వాతావరణం వేడిగా ఉండటంతో గృహాల్లో ఏసీల వినియోగం తగ్గలేదు. దీంతో విద్యుత్ శాఖపై వినియోగ భారం పెరిగింది.
30, 31న కలెక్టరేట్ వద్ద ధర్నా
నరసరావుపేట: ప్రైవేట్ రంగ కార్మికులకు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాలను తక్షణమే సవరించి కర్ణాటక రాష్ట్రంతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు కార్మిక లోకం పెద్దఎత్తున తరలిరావాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు. గురువారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బండ్ల మహేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. వేతనాల సవరణ జరగకపోవడంతో యాజమాన్యాలకు రూ.వేల కోట్ల లాభాలు చేకూరాయని, కార్మికులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నాయకులు డి.శివకుమారి, పి.వెంకటేశ్వర్లు, జి.మల్లీశ్వరి, బి.సూరిబాబు, కె.హనుమంత రెడ్డి, టి.శ్రీనివాసరావు, వేముల వెంకట్రావు, ఎం.రత్నకుమారి, షేక్ సిలార్ మసూద్, కోశాధికారి ఎం.హరిపోతు రాజు పాల్గొన్నారు.


