ఇళ్లు కూలిపోతున్నాయి..
రైతులను భిక్షగాళ్లుగా చూస్తున్నారు
సాక్ష, టాస్క్‌ఫోర్స్: దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ సమీపంలో శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ విస్తరణ, సున్నపురాయి గని విస్తరణ కోసం భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభను బుధవారం నిర్వహించారు. ఈ సభలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, గురజాల, మాచర్ల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో దాచేపల్లి మండలం పెదగార్లపాడు, కారంపూడి మండలం కాచవరం, ఇనుపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల ప్రజలు పాల్గొని తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పై గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చేంత వరకు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దని ప్రజలు జిల్లా కలెక్టర్‌ని కోరారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ..కాచవరం గ్రామంలో ఇళ్లను అనుకుని జరుగుతున్న మైనింగ్‌ని తక్షణమే నిలిపివేయాలని, ఇళ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మైనింగ్ చేయాలని యజమాన్య ప్రతినిధులకు సూచించారు.
కలుషిత నీరు, దుమ్ముతో
రోగాల బారిన పడుతున్నాం
ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వాల్సిందే
శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణపై
ప్రజాభిప్రాయ సేకరణ సభలో
గ్రామస్తుల ఆందోళన
శ్రీ సిమెంట్స్ యజమాన్యం కాచవరం గ్రామానికి 100 నుంచి 150 మీటర్ల దూరంలో భారీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. భారీ బ్లాస్టింగ్ ధాటికి ఇళ్ల గోడలు నెర్రెలు కొట్టి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్లాస్టింగ్ చేయటం కోసం నల్లమందు ఉపయోగించటం వలన తాగేనీరు కలుషితం అవుతున్నాయి. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హతని బట్టి ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వటంలేదు.
– కిష్టాపాటి రవీందర్‌రెడ్డి,
కాచవరం
శ్రీ సిమెంట్స్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను భిక్షగాళ్లగా చూస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముధూళితో పంటలు పాడైపోతున్నాయి. సాగునీటి కాలువలను అక్రమంగా పూడ్చి వేస్తున్నారు. ఫ్యాక్టరీ వల్ల జరుగుతున్న నష్టాలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా సమస్యలు పరిష్కరించకపోతే ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తాం.
– కొరకూటి ఆంజనేయులు, ఇనుపరాజుపల్లి


