అప్పుల బాధతో హోటల్‌ కార్మికుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో హోటల్‌ కార్మికుడు ఆత్మహత్య

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

చిలకలూరిపేటటౌన్‌: భార్య అనారోగ్యం, కొడుకు చదువు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఓ హోటల్‌ కార్మికుడు ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..చిలకలూరిపేట పట్టణంలోని రెడ్ల బజార్‌కు చెందిన షేక్‌ దరియా(51) స్థానిక కిచిడి హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య ఆషాబేగం గత కొంతకాలంగా పక్షవాతం వ్యాధితో బాధపడుతోంది. భార్య వైద్య ఖర్చులకు, అలాగే కొడుకు మహబూబ్‌ సుభాని చదువు నిమిత్తం దరియా పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక, కుటుంబ భారం ఎక్కువై గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది, గత నెల 29న ఇంట్లో ఎలుకల నివారణ పేస్ట్‌ తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. భార్య ఆషాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఫ్లెక్సీ వివాదం

తాడేపల్లి రూరల్‌ : తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉండవల్లి దళితవాడలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుని ఒకరిపై మరొకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అక్కడకు చేరుకుని గుంపులుగా ఉన్న రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం ఫ్లెక్సీ వివాదం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా ఉండవల్లి వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉండవల్లి దళితవాడకు చెందిన ఓ యువకుడు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిని ఏర్పాటు చేయడానికి వీలులేదంటూ రెండవ వర్గం వ్యతిరేకించింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఎవరైనా వివాదాలకు, గొడవలను ప్రోత్సహిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని సీఐ వీరేంద్రబాబు హెచ్చరించి పంపించివేశారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా ముఖ్య కూడళ్లలో ఫిల్టింగ్‌ ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ఫిల్టింగ్‌ కొనసాగుతూనే ఉంది.

శతాధిక వృద్ధుడు ఆగమ పండితులు దీవి వీరరాఘవాచార్యులు మృతి

తెనాలి: ప్రముఖ వైఖానస ఆగమ పండితులు రూరల్‌ మండల గ్రామం కొలకలూరులో వేంచేసి ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయ వంశపారంపర్య అర్చకులు పండిత దీవి వీరరాఘవాచార్యులు (106) మంగళవారం రాత్రి మృతి చెందారు. వృద్ధాప్యంతో ఉన్నప్పటికీ చివరి దశ వరకు ఆరోగ్యంగా ఉంటూ సునాయాస మరణాన్ని పొందారు. వైఖానస ఆగమ శాస్త్రంలో పాండిత్యాన్ని సముపార్జించి ఎందరో శిష్యులకు ఆగమ శాస్త్ర బోధన చేశారు. శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు రచించారు. భగవద్గీతలో పూర్తి సారాంశాన్ని 18 శ్లోకాలతో అందించి గీతా సారంగా హిందూ సమాజంలో విస్తృత ప్రచారం చేశారు. ఆధ్యాత్మికపరమైన కృషితో పాటు ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల ద్వారా సన్మానాలు పొంది తనకు అబ్బిన విద్యను పదిమందికి పంచిపెట్టారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి సీతారామాచార్యులు ఆగమ శాస్త్రంలో పేరు ప్రఖ్యాతలు గడించారు. తల్లి చినరంగమ్మ కూడా 104 సంవత్సరాల వయసులో మృతి చెందారు. వీరరాఘవాచార్యులు మృతి పట్ల వైఖానస ఆగమ సంఘాలు, అర్చక సంఘాలు పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తంచేస్తూ, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

యువతికి సైగలు చేశాడంటూ కొట్లాట

నకరికల్లు: ఫంక్షన్‌లో ఉన్న యువతికి ఓ వ్యక్తి అసభ్యకరంగా సైగలు చేశాడన్న విషయమై జరిగిన ఘర్షణతో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.సతీష్‌ బుధవారం తెలిపారు. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. నకరికల్లులో మంగళవారం జరిగిన ఒక ఫంక్షన్‌లో మహమ్మద్‌ అనే వ్యక్తి ఓ యువతికి అసభ్యకరంగా సైగలు చేశాడన్న విషయమై సైగలు చేసిన వ్యక్తి స్నేహితుడు బాజీకి యువతి తండ్రికి గొడవ జరిగి కొట్టుకోగా ఇరువురికి గాయాలయ్యాయి.

బాలిక అదృశ్యంపై కేసు

ముప్పాళ్ళ: మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.అనిల్‌కుమార్‌ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక ఇంటి నుంచి కాలేజీ కి వెళ్లి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement