నరసరావుపేట ఏరియా వైద్యశాలలో భద్రత ప్రశ్నార్థకం నిత్యం సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాల చోరీలు చీకటి పడితే మితిమీరిపోతున్న మందుబాబుల ఆగడాలు దాడులు, అసాంఘిక కార్యకలాపాలతో రోగుల్లో భయాందోళనలు
సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా..
ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రే ఇప్పుడు రోగుల్లో భయాన్ని నింపుతోంది. అనారోగ్యంతో ఆస్పత్రికి చేరిన వారు వ్యాధి నుంచి కోలుకునేలోపే సెల్‌ఫోన్లు, వాహనం పోతుందేమోనన్న ఆందోళనతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్నాడు జిల్లాకు ప్రధాన వైద్యసేవల కేంద్రంగా ఉన్న నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
నరసరావుపేట టౌన్: ఇటీవల కేసానుపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై గ్రామ టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. క్షతగాత్రులు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రిలోకి చొరబడిన టీడీపీ మూకలు... మరోమారు వారిపై దాడికి దిగారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలోనే ఇలాంటి దారుణం జరగడం భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో వెల్లడిస్తోంది. ఆస్పత్రిలో ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే పర్యవేక్షణ కూడా సమర్థంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సెల్‌ఫోన్ల చోరీలు...
పురుషులు, మహిళా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల సెల్‌ఫోన్లు తరచూ మాయం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ చార్జింగ్ పెట్టిన ఫోన్లు ఉదయం కనిపించకపోవడం లేదని బాధితులు చెబుతున్నారు. పేదలకు సెల్‌ఫోన్లు ఎంతో కీలకం. ఓటీపీలకు కూడా అవే అవసరం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి లేక చాలామంది నష్టాన్ని మౌనంగా భరిస్తున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం కూడా కష్టమవుతోంది.
వాహనాలకూ రక్షణ శూన్యం...
రోజూ వందల మంది రోగులు, వారి బంధువులు ద్విచక్ర వాహనాలతో ఆస్పత్రికి వస్తుంటారు. చికిత్స ముగించుకుని బయటకు వచ్చేసరికి వాహనాలు కనిపించకపోవడం లేదా విడిభాగాలు చోరీకి గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పార్కింగ్ స్థలం ఆక్రమణకు గురవడంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపాల్సి వస్తోంది. దీనిని అవకాశంగా తీసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బందికి కూడా ప్రత్యేక పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చీకటి పడితే చాలు..
రాత్రి కాగానే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. రోగుల సహాయకుల పేరుతో ఆస్పత్రిలోకి ప్రవేశిస్తున్న కొందరు మద్యం తాగి వార్డుల వద్ద సంచరిస్తూ సిబ్బందితో, రోగుల బంధువులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారు కూడా భద్రతపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆస్పత్రిలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించినప్పటికీ వారి విధులు నామమాత్రంగా నిర్వర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చోరీలు జరిగినా సమయానికి స్పందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ సిబ్బంది మెడికల్ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు తీసుకుని డాక్టర్ల వద్ద పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భద్రత కంటే ఇతర వ్యవహారాలపైనే ఆసక్తి చూపుతున్నారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని వైద్యశాల వర్గాలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైద్యాధికారులు పలుమార్లు పోలీస్ శాఖకు ప్రతిపాదనలు పంపినా స్పందన రాలేదని తెలుస్తోంది. ఆస్పత్రిలో పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటే నేరాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. ఒక్కోసమయంలో రెండు వర్గాలు ఒకేసారి వైద్యశాలకు వచ్చినప్పడు ఘర్షణ వాతావరణం ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటైతే ఈ సమస్య కూడా తీరుతుంది.


