12న సత్రశాల దేవస్థానంలో రుద్రాభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

12న సత్రశాల దేవస్థానంలో రుద్రాభిషేకాలు

Jul 8 2026 1:50 AM | Updated on Jul 8 2026 1:50 AM

12న సత్రశాల దేవస్థానంలో రుద్రాభిషేకాలు దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విరాళాలు వైభవంగా వాసవి మాత ఆలయ వార్షికోత్సవం ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

రెంటచింతల: ప్రముఖ శైవ క్షేత్రమైన సత్రశాల గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుంచి గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి సేవాట్రస్టు ఆధ్వర్యంలో సామూహికంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్‌ గుండా వెంకట శివయ్య, సేవాట్రస్టు అధ్యక్షుడు పోలిశెట్టి పిచ్చయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 9.35 గంటల నుంచి నిర్వహించే ఈ వేడుకలలో భక్తులు పాల్గొని మల్లన్న స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ భవానీపురానికి చెందిన పి.రవిచంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. గుంటూరు జిల్లాకు చెందిన సానా శ్రీనివాసరావు అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

ఫిరంగిపురం: మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ 9వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు నగరేశ్వర స్వామికి, వాసవి మాతకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విశేష అర్చనలు, అష్టోత్తర, సహస్రనామ పూజలు చేశారు. అనంతరం లక్ష్మి, గణపతి హోమం, గణపతి పూజ, అంకురార్పణ, మండపారాధన, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ దాచేపల్లి, నరేంద్రకుమార్‌, గుగ్గిళం మధుసూధన్‌, కె.వెంకటేశ్వర్లు, కె.శేషులు తదితరులు పూజాది కార్యక్రమాలను పర్యవేక్షించారు.

అమరావతి: మండల పరిధిలోని లేమల్లె ప్రసన్నాంజనేయస్వామి నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ముందుగా జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తొలుత బాలాలయంలో ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంకరరావును ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. స్వామి వారి శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి నిరంతర కృషి చేసిన బందం రావూరి శ్రీనివాసరావుతోపాటు ఆలయ కమిటీ సభ్యులను శంకరరావు అభినందించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు భవిరిశెట్టి హనుమంతరావు, నేతలు కూరపాటి వాసు, నాగుల్‌మీరావలి, కోపూరి సుధాకర్‌ , మేకల లక్ష్మణ్‌, రహయాన్‌, రాజు, యడ్లపల్లి నేతాజీ, డాక్టర్స్‌ సెల్‌ షరీఫ్‌లతో పాటు ఆళ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement