కొల్లిపర(తెనాలి): ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్‌ఎఫ్) ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలను అధ్యయనం చేసేందుకు కెన్యాకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం కొల్లిపర మండలం బొమ్మువానిపాలెంలో పర్యటించారు. అత్తోటలోని భూమి భారతి దేశ విత్తన సంరక్షణ కేంద్రం ‘భూమిభారతి’ని సందర్శించింది. సీడ్ సేవర్ నెట్‌వర్క్, కెన్యా కో–ఆర్డినేటర్ వంజుమా న్జోరోగే డేనియల్, జిప్పోరా న్యాంబురా కురియా, స్లో ఫుడ్–కెన్యా హెడ్ జాన్ కరియుకి మ్వాంగి, గ్లోబల్ ఫీల్డ్ నెట్‌వర్క్, కెన్యా ప్రతినిధి ఒడ్డా ఫ్రైడే ఒచోమా, న్యూయార్క్ యూనివర్శిటీ–అబుదాబికి చెందిన ఇంటర్న్ ప్రసిద్ధ సప్కోటా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, కొల్లిపర మండల ప్రత్యేక అధికారి, కెన్యా ప్రతినిధుల బృందానికి జిల్లాలో జరుగుతున్న పంటల నమూనాలను వివరించారు. తొలుత రైతు డి.భీమరాజుకు చెందిన ఏటీఎం(ఎనీ టైమ్ మనీ) మోడల్ పంటపొలాన్ని పరిశీలించారు. వంకాయ, మిరప, గోంగూర, టమాటా, కాకర, పొట్లకాయ, బీరకాయ, చిక్కుడు, కరివేపాకు, మామిడి తదితర 20 పైగా పంటలతో ఏర్పాటు చేసిన అక్కడి జీవ వైవిధ్య వ్యవస్థను పరిశీలించారు. క్షేత్రంలో సహజంగా అభివృద్ధి చెందిన ప్రయోజనకర కీటకాలు, సూక్ష్మజీవుల చురుకై న కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అభినందించారు. తర్వాత ఏ–గ్రేడ్ అరటి మోడల్ క్షేత్రాన్ని సందర్శించారు. రసాయన పురుగుమందులు లేకుండా ఏపుగా పెరిగిన అరటి తోటనూ పరిశీలించారు. అరటితో పాటు సాగు చేసిన బంతి, ఆముదం వంటి ట్రాప్ క్రాప్స్‌తో సహజ కీటక నియంత్రణపై కెన్యా ప్రతినిధులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యంపై చూపుతున్న సానుకూల ప్రభావాన్ని గుర్తించారు. తదుపరి హెప్సి స్వయం సహాయక సంఘం సభ్యులతో నిర్వహించిన పరస్పర సమావేశంలో, మహిళలు ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా అమలు చేస్తున్నారో, గ్రామస్థాయిలో ఏఏల పాత్ర, ప్రభుత్వ రుణాలు, రుణాలు, కుటుంబ పోషణ, రైతుల జీవనోపాధిలోమార్పులను తెలుసుకున్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు, జీవ వైవిధ్య ఆధారిత సాగు, సహజ కీటక నియంత్రణ పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, మహిళల భాగస్వామ్యాన్ని కెన్యా ప్రతినిధులు ప్రశంసించారు. ఈ నమూనాలు వాతావరణ మార్పులను ఎదుర్కొనే సుస్థిర వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు.


