నాదెండ్ల: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న మనస్తాపంతో తండ్రి ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన గణపవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గణపవరం గ్రామానికి చెందిన అచ్చి కాళహస్తి (46) చికెన్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కాళహస్తికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 26న కుమార్తె పార్వతి ఇంటి నుంచి వెళ్ళి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన కాళహస్తి ప్రతిరోజూ మదనపడేవాడు. గత నెల 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల పేస్ట్ తిన్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కుమారుడు రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


