రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో పల్నాడు జట్టుకు తృతీయ స్థా
సత్తెనపల్లి: కర్నూలులోని ఆదర్శ విద్యాసంస్థలలో ఈ నెల 29, 30వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రగ్బీ పోటీలలో పల్నాడు జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించిందని పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.డానియెల్ బుధవారం ఓక ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ ఎం.ప్రకాష్‌లు అభినందించారు. ఈ జట్టుకి కోచ్‌గా ఎం.బాలాజీ వ్యవహరించినట్లు తెలిపారు.
నకరికల్లు: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి మళ్లించాలని ప్రకృతి వ్యవసాయం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎ.అమలాకుమారి సూచించారు. జిల్లాలోని తురకపాలెం గ్రామంలో, నకరికల్లులోని రైతుసేవ కేంద్రంలో బుధవారం రైతులతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రబీ డ్రై సోయింగ్‌లో భాగంగా 30 రకాల విత్తనాలు వేసుకోవాలని సూచించారు. పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. కొత్త వరి వంగడం డీఆర్‌ఆర్ ధన్ 48 గురించి అవగాహన కల్పించి ప్రతి రైతుకు ఎకరాకు సరిపడా 20 కిలోల విత్తనాలు ఉచితంగా ఇస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ గంగాదేవి, మండల వ్యవసాయాధికారి కె.దేవదాసు, ఎన్‌ఎఫ్‌ఏ అప్పలరాజు, మాస్టర్ ట్రైనర్ బాజీబాబు, సుబ్బారెడ్డి, ఎఫ్‌ఎంటి రామసుబ్బారెడ్డి, రేణుక, ఐసీఆర్‌పీలు, రైతులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీషీట్ తెరవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తక్షణమే రౌడీషీట్ ఎత్తివేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.వలి డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద బుధవారం ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తెరిచిన రౌడీషీట్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అధ్యక్షుడు జంగాల చైతన్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్, సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర నాయకులు అజయ్, సతీష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కొరిటెపాడు: రైతుల సంక్షేమం కోసం నూతన మార్పులను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రవేశపెట్టిందని జనరల్ మేనేజర్ బుధవారం తెలిపారు. మెరుగైన డిజిటల్ కార్యక్రమాల వల్ల పెరిగిన సేకరణ, మెరుగుపడిన రైతు భాగస్వామ్యం, పత్తి రైతులకు సాధికారత కల్పించడం, కార్యకలాపాలను మెరుగుపరచడం లక్ష్యంగా పలు రైతు–కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ సంస్కరణల్లో భాగంగా ‘కపాస్ కిసాన్’ మొబైల్ అప్లికేషన్ ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఇది రైతులు తమ పంట సేకరణ స్లాట్లను సులభంగా, పారదర్శకంగా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు. ఈ యాప్ వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే సమయం తగ్గడంతోపాటు పత్తి విక్రయ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. దీని ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో పత్తి సేకరణ పెరిగిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయానికి 14,63,341.24 క్వింటాళ్ల పత్తి సేకరించగా, ఈ ఏడాది అది 15,73,108.98 క్వింటాళ్లకు చేరుకుందన్నారు.


