చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త పింఛన్లు కరువు
తెనాలిఅర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న ఇప్పటివరకు ఒక్క నూతన పింఛన్లను ఇవ్వలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ కూడా పనిచేయడం లేదు. కొత్త పింఛన్లు ఇప్పించమని వృద్ధులు, దివ్యాంగులు తమ వద్ద ఏకరువు పెడుతున్నారంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ ఆవుల కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని కౌన్సిల్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. సమావేశానికి చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. పింఛన్లపై చర్చ జరుగుతుండగా టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి తమ ప్రభుత్వంలో నూతన పింఛన్లు ఇచ్చామని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్లు మధ్య వాదోపవాదాలు ప్రారంభమవడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక అందరిని శాంతిపచేసి ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలని సూచించారు. అయినా సమావేశం గందరగోళంగా మారడంతో ఐదు నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు లేచి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి దాని ప్రకారం నూతన పింఛన్లు ఆరు నెలలకు ఒకసారి మంజూరు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో భర్త చనిపోయితే భార్యకు పింఛన్లు ఇచ్చారని, మిగిలిన ఎటువంటి దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు నూతనంగా మంజూరు చేయలేదని తెలిపారు. అనంతరం అజెండాలోని మొదటి అంశాన్ని చదవడం ప్రాంరభించారు.
● కౌన్సిలర్లు మొగల్ అహ్మాద్ బేగ్, తాడిబోయిన రామయ్యలు అధికారులను పట్టణంలోని పలు సమస్యలపై ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ జాగారపు రామ అప్పలనాయుడు, ఏసీపీ వాణిలు సమాధానమిచ్చారు. అదేవిధంగా వైస్‌చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, మట్లపూడి సంధ్యారాణి, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, మల్లిబోయిన సువర్ణరేఖాదేవిలు మాట్లాడారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్‌పర్సన్ రాధిక ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, పింఛన్ల కోసం ఎదురుచూపులు
నూతన పింఛన్ల మంజూరు ఎప్పుడో
తెలపాలని తెనాలి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కోటయ్య వినతి
చర్చను అడ్డుకున్న టీడీపీ కౌన్సిలర్లు
చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త పింఛన్లు కరువు


