ఆటో బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
కారెంపూడి: ముఠా కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని పెదకొదమగుండ్ల గ్రామ శివారు బ్రహ్మనాయుడు కాలనీ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ముఠా కూలీలు పచ్చి మిరపకాయల బస్తాలు కాటా వేసి తరలించేందుకు ట్రాలీ ఆటోలో బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలోని పొలానికి వెళ్లారు. పని ముగించుకుని ఆటోలో పొలం బాట నుంచి రోడ్డు ఎక్కిన తర్వాత ఆటోను రివర్స్ చేస్తున్న క్రమంలో వెనుకున్న లోతైన గోతిలో పడిపోయిందని చెబుతున్నారు. ప్రమాదంలో ట్రాలీ ఆటోపై కూర్చున్న వారు కిందపడిపోగా... వారిపై ఆటో బోల్తాపడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మొగిలి సైదులు (44), షేక్ సమీర్ (20)గా గుర్తించారు. అదే గ్రామంలోని పొట్టి శ్రీరాములు కాలనీకి చెందిన బత్తుల త్రినాథ్‌కు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. కారెంపూడి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వాసు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


