వెనుకబడిన విద్యార్థులపై నిర్లక్ష్యం
టెన్త్ పరీక్షలకు వంద రోజుల ప్రణాళిక అందరికీ ఒకే విధానం..ఎలా సాధ్యం? ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ 100 రోజుల ప్రణాళికతో విద్యార్థుల పై ఒత్తిడి
బోధన కన్నా .. ‘యాప్’ల గోలే మిన్న
సత్తెనపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. శత శాతం ఫలితాలు సాధించడం కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రోజంతా తరగతులు, మళ్లీ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు, సెలవు రోజుల్లో కూడా తరగతుల నిర్వహణ కారణంగా విద్యార్థులకు విశ్రాంతి కరువవుతోంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఏకపక్ష ప్రణాళికతో ..
జిల్లాలో 470 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 25,534 మంది పదవ తరగతి అభ్యసిస్తున్నారు. వీరిలో 273 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 14,668 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయబోతున్నారు. అయితే ప్రతి పాఠశాల వాతావరణం, అక్కడి విద్యార్థుల సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ విద్యాశాఖ మాత్రం రాష్ట్ర మంతటా ఒకే తరహా టైం టేబుల్, ఒకే తరహా బోధన రుద్దడం పై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఒక సబ్జెక్టు బోధన జరిగిన తర్వాత, మళ్లీ ఆ సబ్జెక్టు క్లాస్ రావడానికి రెండు రోజులు సమయం పడుతోంది. దీనివల్ల చదువులో కాస్త వెనుకబడిన విద్యార్థులు గతంలో చెప్పింది మరిచిపోయే ప్రమాదం ఉంది. నిత్యం సాధన చేయాల్సిన గణితం, సైన్‌న్స్ వంటి సబ్జెక్టులకు ఈ ‘గ్యాప్’ ఇబ్బంది కరంగా మారింది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు చెబుతున్నా .. చేతికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సిలబస్ పరిగెత్తించడానికి సమయం సరిపోవడం లేదు. దీంతో నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థు లను ప్రత్యేకంగా గమనించే అవకాశం ఉపాధ్యాయులకు లేకుండా పోతోంది.
పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను శత శాతంలో నిలపాలన్న సంకల్పం మంచిదే అయినా .. ఆచరణలో ఉపాధ్యాయులపై పడుతున్న పనిభారం అసలు లక్ష్యాన్ని దెబ్బ తీస్తోంది. రోజూ ఉదయం జిల్లా కార్యాలయం నుంచి వచ్చే వాట్సాప్ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించడం, పరీక్ష పెట్టడం, ఆ వెంటనే మార్కులను సాయంత్రం లోపు ‘లీప్ యాప్’లో అప్‌లోడ్ చేయడం .. ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. బోధన కంటే ఈ సాంకేతిక పనులకే ఉపాధ్యాయుల సమయం హరించకుపోతోంది. విద్యార్థులకు పాఠం చెప్పాలా? లేక యాప్‌లో మార్కులు ఎక్కించాలా? అన్న సందిగ్ధంలో ఉపాధ్యాయులు కొట్టుమిట్టాడుతున్నారు.


