చట్టానికి లోబడి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి
నరసరావుపేట: నూతన సంవత్సర వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. వేడుకల పేరుతో చట్ట నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజా శాంతి, భద్రతలను పరిరక్షించేందుకు జిల్లా పోలీస్ శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ప్రజలు తప్పనిసరిగా పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటించాలని కోరారు. డిసెంబరు 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వేడుకలు నిర్వహించవద్దని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని, డ్రైవింగ్ లైసెన్సు శాశ్వతంగా రద్దు చేసే చర్యలు చేపడతామని హెచ్చరించారు. అతివేగం, బైక్ రేసింగ్, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేయడం, అనవసరంగా హారన్‌లు మోగించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నిర్ణీత సమయం వరకే ప్రజలు బయట తిరిగేందుకు పోలీస్ శాఖ తరపున అనుమతించడం జరుగుతుందన్నారు. వయస్సు నిండని పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి, రాత్రి గస్తీ, డ్రోన్ పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మాత్రమే మద్యం విక్రయాలు జరగాలన్నారు. అవాంఛనీయ ఘటనలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలకు సూచించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు


