8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అదే రోజు జనరల్ బాడీ సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను జనవరి 8న నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. గత నెల 26న వాయిదా పడిన 1, 7వ స్థాయీ సంఘ సమావేశాలతో పాటు అదే రోజు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన గతనెల 26న భేటీ అయిన ప్రణాళిక–ఫైనాన్స్‌కు సంబంధించిన 1వ స్థాయీ సంఘం, పనులకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన 7వస్థాయీ సంఘ సమావేశాలను సభ్యులు బహిష్కరించడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. జెడ్పీటీసీలకు సమాచారం ఇవ్వకుండా, వారికి తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ, ఏకపక్షంగా పనులను ఆమోదిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు సమావేశాలను బహిష్కరించారు. దీంతో ఆయా అంశాలకు సంబంధించిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మరలా వాటిని ఆమోదింపచేసుకునేందుకు జనవరి 8న ఉదయం 9.30 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలను ప్రారంభించి, ఉదయం 11.30 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదంపై చర్చించనున్నారు.


