కేంద్ర పథకాల అమలులో జిల్లాకు ప్రథమ స్థానం
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో పల్నాడు జిల్లాలో రూ.167 కోట్ల నిధులకు 91శాతం వినియోగించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో పాత్రికేయులతో సమావేశమయ్యారు. జిల్లాలో సాధిస్తున్న అభివృద్ధి, చేపడుతున్న పనులు, అమలు చేస్తున్న సంక్షేమం గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన అంశాలను అమలు చేయటంలో పల్నాడు జిల్లాకు రెండో ర్యాంకు లభించిందని తెలిపారు. ఉద్యాన రంగంలో రూ.927 కోట్ల వినియోగంతో ద్వితీయ స్థానం పొందామన్నారు. జిల్లా జీడీపీ వృద్ధి లక్ష్యం రూ.53,505 కోట్లు కాగా గడిచిన ఆర్నెల్లు కాలంలో రూ.19,600 కోట్ల వృద్ధి సాధించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.5,480 కోట్లు, పారిశ్రామిక రంగంలో రూ.3,738 కోట్లు, సేవారంగంలో రూ.8,972 కోట్లు వృద్ధి సాధించామని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద 2,40,350 మంది రైతులకు రూ.319.50 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. జిల్లాలో బ్లాక్ బెర్రీ పొగాకు సాగు ఈ ఏడాది నిషేధించామని, 1025 హెక్టార్లలో సూక్ష్మ సేద్య పరికరాలు వితరణ చేశామన్నారు. బుగ్గవాగు రిజర్వాయర్ గేట్లు, ఇతర మరమ్మతులకు రూ.3.19 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పశుసంవర్ధకశాఖ ద్వారా 60మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు అందజేశామని, కామధేను పథకం ద్వారా 849 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం పంపిణీ చేశామన్నారు. రైతులకు 1857 క్రెటిడ్ కార్డుల పంపిణీ, ప్రకృతి వ్యవసాయ ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించటం, ఆయిల్‌ఫామ్ సాగును మరో 300హెక్టార్లకు విస్తరిస్తున్నామన్నారు. జిల్లాలో 43,368మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారని, 42,267మంది రైతులు 67,366 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. పీఎం కుసుం పథకం కింద 13,210 పంపుసెట్లకు సోలార్ పవర్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వైజాగ్‌లో నిర్వహించిన సీఐఐ సమ్మిట్ ద్వారా జిల్లాలో రూ.5,560 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏడు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. కోటప్పకొండ వద్ద రూ.36కోట్లతో బెల్లంకొండ ఇన్ రిసార్ట్స్ హోటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాతకోటయ్యస్వామి దేవాలయం వరకు మెట్ల నిర్మాణం చేపడతామన్నారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం 76శాతం నుంచి 80.13శాతానికి పెంచామని, రాష్ట్ర స్థాయిలో 18వ స్థానం నుంచి 11వ స్థానానికి పెరిగామన్నారు. పాస్ పర్సంజేట్ పెంచేందుకు డిసెంబరు నుంచి వందరోజుల యాక్షన్‌ప్లాన్ అమలుచేస్తున్నామన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో సగటున 2.5మేర భూగర్భ జల నీటిమట్టం పెరిగిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 59,746 గృహాలు మంజూరైతే 44,105 గ్రౌండింగ్ చేసి 27,757 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశామన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. డీఆర్‌ఓ ఏకా మురళి పాల్గొన్నారు.
వార్షిక ప్రగతి, విధానం వివరించిన
కలెక్టర్ కృతికా శుక్లా


