డీనోటిౖఫైపె యథాస్థితి కొనసాగించండి
జంగమహేశ్వరపురం
సాక్షి, అమరావతి: గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం పంచాయతీని చట్ట నిబంధనలకు విరుద్ధంగా డీ–నోటిఫై చేసే ప్రక్రియను చేపట్టడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. జంగమహేశ్వరపురంపంచాయతీని డీ నోటిఫై చేసే విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు మంగళవారం గురజాల నగర పంచాయతీ కమిషనర్, చైర్మన్‌లను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జంగమహేశ్వరపురం గ్రామ పంచాయతీని గురజాల నగర పంచాయతీ నుంచి డీ నోటిఫై చేసేందుకు వీలుగా నగర పంచాయతీ పాలక మండలి చేసిన తీర్మానాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపడాన్ని సవాలుచేస్తూ కౌన్సిలర్ పోలు పుణ్యమయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. గ్రామ పంచాయతీని డీనోటిఫై చేసేందుకు తీర్మానం చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వు ల ప్రకారం పది రోజుల ముందస్తు నోటీసు ఇవ్వ డం తప్పనిసరన్నారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపాలి టీల చట్టంలోని సెక్షన్ 32, షెడ్యూల్ 1, రూల్ 2(1) ప్రకారం పాలకమండలి సమావేశానికి మూడు రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. జంగమహేశ్వరపురం గ్రామ పంచాయతీని డీ నోటిఫై చేసే విషయంలో అధికారులు ఈ నిబంధనలను కనీస స్థాయిలో పాటించలేదన్నారు. కౌన్సిలర్ అయిన పిటిషనర్ పాలక మండలి సమావేశానికి హాజరయ్యేందుకు అవకాశం ఉన్నా కూడా దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ ఆమెను అడ్డుకున్నారని రామలక్ష్మణ్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జంగమహేశ్వరపురం గ్రామ పంచాయతీ డీ నోటిఫై వ్యవహారం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ పరిశీలనలో ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తాము దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందన్నారు. నగర పంచాయతీ అధికారుల తరఫు న్యాయవాది వల్లభనేని శిరీష స్పందిస్తూ, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జంగమహేశ్వరపురం గ్రామ పంచాయతీని డీ నోటిఫై చేసే విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను జనవరి 6కి వాయిదా వేశారు.


