3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు
పెదకాకాని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు సంబంధించిన ప్రచార ప్రతులను వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మొవ్వా శ్రీనివాసరెడి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యయనాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమన్నారు, అవగనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారనీ, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనా పత్రాల సమర్పణ, చర్చలు జరుగుతాయని వివరించారు. పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏఎన్‌యూ హిస్టరీ ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ కె.గిరిబాబు, వీవీఐటీయూ పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవికృష్ణ పాల్గొన్నారు.
‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్‌పై గ్రామ సంఘ సహాయకులకు శిక్షణ
ఇంకొల్లు(చినగంజాం): గ్రామ పొదుపు సంఘాల సభ్యులు ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్‌ను వినియోగించుకొని సంఘాల్ని సమర్థంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా సంస్థాగత నిర్మాణ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కాకి రవికుమార్ తెలిపారు. మండల వెలుగు కార్యాలయంలో సోమవారం పర్చూరు, కారంచేడు మండలాల గ్రామ సంఘ సహాయకులకు యాప్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘాల సభ్యులకు, సభ్యురాళ్లకు పొదుపు, అప్పు వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా చూసుకునే సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా సంఘాల్లో జరిగే చిన్న తప్పిదాల్ని అరికట్టవచ్చని తెలిపారు. సంఘం, సభ్యుల లెక్కలు పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నెలా నిర్ణీత తేదీ ప్రకారం గ్రామ సంఘ సహాయకులు లెక్కలను మొబైల్ ద్వారా ఆన్‌లైన్ చేస్తారని పేర్కొన్నారు. జిల్లా బ్యాంక్ లింకేజ్ డీపీఎం అనంత లక్ష్మణాచారి మాట్లాడుతూ తీసుకున్న అప్పు మొత్తాన్ని జీవనోపాధులకే వినియోగించుకోవాలని, తద్వారా కుటుంబాల ఆర్థికస్థితి పెరుగుతుందని తెలిపారు. శిక్షణకు రిసోర్స్ పర్సన్‌లుగా కె.విజయభాస్కర్, ఓ.శ్రీనివాసరావు, పర్చూరు, కారంచేడు ఏపీఎంలు టి. మోహనరావు, కె.రామకృష్ణ, ఇంకొల్లు ఏపీఎం అనురాధ, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు.
3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు


