పిడుగురాళ్ల ఐఎంఏ అధ్యక్షుడికి జాతీయ అవార్డు
పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల శాఖ అధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ్ల భరత్‌కుమార్ జాతీయ అవార్డు అందుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ షేలా క్లబ్‌లో నిర్వహించిన ఐఎంఏ జాతీయ సదస్సులో ఈ అవార్డును గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి, రాజ్యసభ సభ్యులు మాయాస్కబాల్ నాయర్, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ బన్సాలి, జాతీయ కార్యదర్శి సర్బరి దత్, జాతీయ నూతన అధ్యక్షుడు డాక్టర్ అనిల్ నాయక్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు పిడుగురాళ్ల బ్రాంచ్ అధ్యక్షులుగా ఎన్నికై నప్పటి నుంచి 31.5 శాతం మెంబర్స్ వృద్ధి, కన్సిట్యూషనల్ జాతీయ ఐఎంఏతో ఆమోదం చేయించుకోవడం వంటి కార్యక్రమాలు చేయటం వలన అవార్డు దక్కిందని డాక్టర్ భరత్‌కుమార్ తెలిపారు. డాక్టర్ భరత్‌కుమార్‌ను పిడుగురాళ్ల పట్టణంలోని ఐఎంఏ సభ్యులతోపాటు, పురప్రముఖులు అభినందించారు.
చిలకలూరిపేటటౌన్: అనుమానం పెనుభూతమై ఓ నిండు సంసారంలో చిచ్చుపెట్టిన ఘటన చిలకలూరిపేట మండలంలోని వేలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లడి సల్మాన్‌రాజు తన భార్య పుష్ప (34) ప్రవర్తనపై అనుమానంతో, సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలిబండతో బలంగా మోది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్ర రక్తగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.
నరసరావుపేట టౌన్: ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరంపేట హిందూ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న కాకుమాను సాయిభార్గవ్ దిలీప్(19) అతను నివాసం ఉంటున్న డాబాఫస్ట్ ప్లోర్ రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉందని సీఐ తెలిపారు.
పెదకాకాని: అనుమతులు, బిల్లులు లేకుండా అమ్మకాలు చేస్తున్న దుకాణాల్లో ఉన్న ఎరువుల విక్రయాన్ని నిలిపివేసినట్లు మండల వ్యవసాయ శాఖాధికారి కె.రమణకుమార్ అన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రైవేటు దుకాణాలకు యూరియా సరఫరా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ అధిక ధరలకు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. బిల్లులు లేకుండా ఎరువుల అమ్మకాలపై సోమవారం అధికారి రమణకుమార్ వెనిగండ్ల, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు గ్రామాల్లోని షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. వెనిగండ్ల దుకాణాల్లో అనుమతులు, సరఫరా వివరాలు లేని ఎరువులను గుర్తించారు. 4.35 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా అమ్మకాలు చేపట్టినా, అధిక ధరలకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ నూతన సంవత్సర డైరీ, కేలండర్‌తో పాటు జీవో ప్రతుల పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ జీవోల కాపీలను ఒకే పుస్తకంలో చేర్చడం అభినందనీయమన్నారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా యూటీఎఫ్ ముద్రించిన స్టడీ మెటీరియల్, డ్రగ్స్‌ను పారతోలతాం అనే కరపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు ఎండీ షకీలాబేగం, జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, ఎం.కోటిరెడ్డి, బి.ప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పిడుగురాళ్ల ఐఎంఏ అధ్యక్షుడికి జాతీయ అవార్డు
పిడుగురాళ్ల ఐఎంఏ అధ్యక్షుడికి జాతీయ అవార్డు
పిడుగురాళ్ల ఐఎంఏ అధ్యక్షుడికి జాతీయ అవార్డు
పిడుగురాళ్ల ఐఎంఏ అధ్యక్షుడికి జాతీయ అవార్డు


