ఉత్తమ సేవకు జాతీయ గుర్తింపు
అవార్డు బాధ్యతను పెంచింది
మాచర్ల: మాచర్ల ప్రాంతంలో వందలాది మందికి నిత్యం ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నందుకుగాను మాచర్ల కమ్యూనిటీ ప్రభుత్వాసుపత్రికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. అనేక సంవత్సరాల కిందట మాచర్ల కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి నిర్మించారు. తొలుత 20 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 పడకలకు అఫ్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 10 మంది వైద్యులతోపాటు 16 మంది స్టాఫ్ నర్సులతోపాటు వివిధ విభాగాల టెక్నీషియన్లు, శానిటరీ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రతి రోజూ 400 మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. వివిధ విభాగాలలో పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఎక్సరే, ఈసీజీ పరీక్షలతోపాటు ఆపరేషన్లు సమర్థంగా నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్యులు ఎంతో మెరుగైన సేవలందించటంతో గతేడాది రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈనెల 3,4 తేదీల్లో ఢిల్లీ నుంచి బృందం వచ్చి రెండు రోజులపాటు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించింది. వార్డులు, అత్యవసర సర్వీసు, ఎఆర్‌టీ సెంటర్, హెచ్‌ఐవీ, టీబీ తదితర విభాగాలు పరిశీలించింది. ఆపరేషన్లు నిర్వహించే తీరు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పరిశీలించి 91.7 శాతం సేవలందిస్తున్నట్లు గ్రేడ్ నిర్ణయించి ఆ తరువాత ఆసుపత్రికి జాతీయ స్థాయి క్వాలిటీ ఎష్యూరెన్సు సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. ప్రభుత్వాసుపత్రికి ఇంత మంచి గుర్తింపు రావటం సంతోషకరమని పలువురు వైద్యులు పేర్కొన్నారు.
ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు రావటం ఆనందంగా ఉంది. జిల్లా వైద్యాధికారుల సహకారంతోపాటు ఆసుపత్రి వైద్యులు, ఉద్యోగులు, టెక్నీషియన్లు కష్టపడి పనిచేయటం ద్వారానే ఈ గుర్తింపు వచ్చింది. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో మా బాధ్యత మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత ఉత్తమ సేవలందించేందుకు మా టీమంతా సర్వం సిద్ధంగా ఉంటుంది. వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలి.
– డాక్టర్ కేపీ చారి, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఉత్తమ సేవకు జాతీయ గుర్తింపు


