భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ దోహదం
మా భూములను 22ఏ నుంచి విడిపించండి
నరసరావుపేట: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో విడిగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్‌ను కలెక్టర్ ప్రారంభించారు. క్లినిక్ పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి అందులో దరఖాస్తుల పరిశీలన, సలహా సూచనల విభాగం, 22–ఏ సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్‌ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, సుమోటో అడంగల్ కరెక్షన్ సంబంధిత సమస్యలు, రీసర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్(ఎల్పిఎం) సంబంధిత సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యల విభాగాలున్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన విధంగా రెవెన్యూ క్లినిక్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎక్కువగా భూ సంబంధ సమస్యలు ఉంటున్నాయని వాటన్నిటికీ రెవిన్యూ క్లినిక్ ద్వారా చక్కటి పరిష్కారం లభించనుందన్నారు. ప్రజలందరూ రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూకు సంబంధించి మొత్తం 72 అర్జీలు స్వీకరించగా వాటిలో నరసరావుపేట డివిజన్ నుంచి 21, సత్తెనపల్లి, గురజాల డివిజన్ల నుంచి 24, 21 స్వీకరించారు. డీఆర్‌ఓ ఏకా మురళి, మూడు డివిజన్ల ఆర్‌డీఓలు, నరసరావుపేట తహసీల్దార్ వేణుగోపాలరావు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 121 అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వారం కూడా పింఛన్ల కావాలంటూ పెద్దసంఖ్యలో దివ్యాంగులు, వృద్ధులు తరలివచ్చారు. దివ్యాంగుల వద్దకు తానే స్వయంగా పోడియం దిగి వచ్చి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టరేట్‌లో క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్
సర్వే నంబరు 367లో 16.78 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో 15.78 ఎకరాలు రైతుల పేర్లపై 1930 నుంచి పట్టాలు ఉన్నాయి. వీటిని 2016లో 22–ఏ కింద దేవాదాయ భూములు అంటూ నిషేధం పెట్టారు. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ విభాగం నుంచి విడిపించి తమకు న్యాయం చేయాలి.
– అలవాలపల్లి కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి,
కొండ్రగుంట్ల, ఈపూరు మండలం


