హమ్మయ్యా... బతికించారు..
స్మార్ట్ ఫోన్ నుంచే జీవన ధ్రువీకరణ లైఫ్ సర్టిఫికెట్లు అవసరం లేదు జీవన్ ప్రమాణ్ యాప్‌తో వెసులుబాటు జిల్లాలో 12,242 మంది పెన్షన్‌దారులు
ప్రభుత్వ పెన్షనర్లు ఏటా తాము బతికి ఉన్నామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో ఏడాది ప్రారంభంలో వయో భారంతో కాగితాలు చేత పట్టుకుని వ్యయ ప్రయాసలతో ఉపఖజానా కార్యాలయాల చుట్టూ తిరిగి ‘జీవన ధ్రువపత్రాలు’ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా ఇక్కట్లకు ‘జీవన్ ప్రమాణ్ యాప్’ చెక్ పెట్టింది. ఈ యాప్‌లో ముఖ ఆధారితంగా పంపే వెసులుబాటు కలిగింది. దీని పుణ్యమా అని త్వరితగతిన ఉపఖజానా కార్యాలయానికి అవసరమైన సర్టిఫికెట్‌ను ఇస్తున్నారు.
సత్తెనపల్లి: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ నుంచే ప్రభుత్వ పింఛన్‌దారులు తాము ఉన్న చోటు నుంచే జీవన్ ప్రమాణ్ యాప్‌లో ముఖ ఆధారిత గుర్తింపు పంపే సౌలభ్యం కలిగింది. వయోభారం మూలాన నడవలేని స్థితిలో ఉన్న పింఛన్‌దారులను గుర్తించి, ఉపఖజానా కార్యాలయం సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి, జీవన్ ప్రమాణ్ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వాస్తవానికి బయోమెట్రిక్, ఐరిస్ విధానాల్లో చేతి వేలిముద్రలు అరిగి పోవడం, కంటి సమస్యలతో కొందరికి ఇబ్బందులు తప్పేవి కాదు. అవసరమైన సాంకేతికతను నవీకరిస్తున్నా సమస్యలు వెంటాడేవి. ఇప్పుడు జీవన్ ప్రమాణ్ యాప్‌తో ముఖ ఆధారిత గుర్తింపు విధానం అమల్లోకి తేవడంతో పండుటాకుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
జిల్లాలో 12,242 మంది పెన్షన్ దారులు...
ఏటా జనవరి నెల ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28 లోపు జీవన ప్రమాణ పత్రాలు ఉపఖజానా కార్యాలయాల్లో పెన్షనర్లు సమర్పించాల్సి వచ్చేది. జిల్లాలో 9 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు కలిపి 12,242 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల పెన్షన్ రూపంలో రూ.52,13,34,735 నగదు ఇస్తున్నారు.
జీవన ధ్రువీకరణ విషయంలో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. అధునాతన సాంకేతికతతో వీటి ప్రక్రియ వేగం పొందుతుంది. వృద్ధులకు ఇప్పుడు ఎంతో ఊరట లభిస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా జీవన ధ్రువీకరణ పత్రం అందించాలి. ఒక వేళ 80 ఏళ్లు దాటిన వారు మంచంపై ఉండే పరిస్థితి ఉంటే వాళ్లు రాలేని పరిస్థితి ఉన్నట్‌లైయితే సమీప ఉపఖజానా కార్యాలయంలో తెలియ చేస్తే ఇంటికి వచ్చి యాప్‌లో వేలిముద్ర లేక ముఖ ఆధారిత గుర్తింపు తీసుకుంటారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే నా దృష్టికి తీసుకురావచ్చు.
– కె.శ్రీనివాసరావు,
జిల్లా ట్రెజరీ అకౌంట్స్ ఆఫీసర్, పల్నాడు
జీవన ఆమోదం కోసం ఇప్పుడు బెంగ తీరింది. కొత్త ఏడాది వస్తే చాలు వీటి కోసం ఎన్ని కష్టాలు పడాలో దేవుడా అని పెన్షనర్లు ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్‌తో ఈ పని పూర్తి చేయడం ఎంతో నిశ్చితంగా ఉంది. ఏ ఇబ్బందీ లేదు. స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియని కొందరు ఇంట్లో పిల్లలు సాయంతో పని సునాయాసంగా చేయించుకోగలుగుతున్నారు.
– జక్కుల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు, పెన్షనర్స్ అసోసియేషన్, సత్తెనపల్లి
హమ్మయ్యా... బతికించారు..
హమ్మయ్యా... బతికించారు..


