
ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు
రేపల్లె: ద్విచక్ర వాహన దుండగులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం దుండగుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన పట్టణంలోని రింగు రోడ్డు సెంటర్‌లో బొర్రా కృష్ణ తన ద్విచక్ర వాహనాన్ని సెంట్రల్ పార్కింగ్ చేసి దుకాణానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తన వాహనం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె–పెనుమూడి రోడ్డులో పోలీసులు సోమవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొల్లూరుకు చెందిన ముగ్గురు బాలురు పట్టుబడ్డారు. వారిని విచారించగా ద్విచక్ర వాహనాన్ని దొంగిలించడంతోపాటు పలు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.9.6 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరికి గతంలో నేర ప్రవృత్తి లేదని పేర్కొన్నారు. డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడటం ప్రారంభించారన్నారు. యూట్యూబ్‌లో వచ్చే వివిధ అంశాలను పరిశీలించి ఈ దొంగతనాలు సులభంగా చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను గమనిస్తూ ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ రాజశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.