
నత్తనడకన పొగాకు కొనుగోళ్లపై మండిపాటు
నాదెండ్ల: పొగాకు కొనుగోళ్లు మందకొండిగా సాగుతుండటంతో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని నాయకులు అధికారులపై మండిపడ్డారు. చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కె. బంగారురాజు, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్లు నరసింహారెడ్డి, రమేష్, యార్డు కార్యదర్శి తిరుపతిరాయుడు సందర్శించారు. వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ షేక్ కరిముల్లా, తెలుగు రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు, మండల నాయకులు మదన్‌మోహన్, సాయిబాబు, యార్డు డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి పొగాకు కొనుగోళ్లపై అధికారులను ప్రశ్నించారు. రెండు నెలలుగా కొనుగోలు జరుగుతున్నా ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదని, ఇంకా కొనాల్సిన పొగాకు ఎక్కువగా ఉందని తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున, రైతులు పొగాకు అమ్ముకునేందుకు యార్డు వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు రైతులకు దక్కడం లేదని తెలిపారు. ఇప్పటి వరకూ చిలకలూరిపేట ప్రాంతంలో 15–20 వేల క్వింటాళ్ల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 90 వేల క్వింటాళ్లకు పైగా పొగాకు రైతుల వద్ద నిల్వ ఉందని, కొందరు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సి వచ్చిందని వివరించారు. అధికారులు త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగారురాజు ఎదుట నాయకులు, రైతుల ఆక్రోశం