చిలకలూరిపేట: రాజకీయ అరాచకాలకు పరాకాష్ట కూటమి ప్రభుత్వ పాలన అని... న్యాయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పరిపాలనపై, పేదలపై ప్రేమ లేదని, కేవలం రాజ్య హింసను మాత్రమే ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డా రాకేష్‌గాంధీ కేసు విచారణ నిమిత్తం చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బుధవారం ఆయన హాజరయ్యారు. మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడంలో పురోగతి సాధించిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కోరితే రాష్ట్ర డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వరని, టీడీపీ వారు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం కేసులు నమోదు చేయరని ఆరోపించారు. అదే టీడీపీకి చెందిన వారు ఫిర్యాదు చేయడం ఆలస్యం, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు రాష్ట్రం నలుమూలల కేసులు నమోదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న ఆరాచక వైఖరిని మర్చిపోమని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పోలీసు అధికారులను న్యాయ స్థానాల ముందు నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు. జర్మనీలో హిట్లర్ పరిపాలన కాలంలో ముందుగా యూదులను వేధించారని, తమను కాదని కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నారన్నారు. అనంతరం కమ్యూనిస్టులను, సోషలిస్టులను కూడా వేధించారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్న ప్రభుత్వం తదుపరి సమస్యలపై ప్రశ్నించే ప్రతి గొంతుకను వేధించటం ఖాయమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు.
అన్నీ తప్పుడు కేసులే !
ప్రస్తుతం కేసులు బనాయించి వేధిస్తున్న దొడ్డా రాకేష్ గాంధీ కేసులో పేర్కొన్న ఆరో తేదీ రాత్రి 9గంటలకు గుంటూరులోని శ్యామలానగర్‌లో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు ఉన్నాయని, అవి న్యాయస్థానంలో అందజేశామని తెలిపారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఫణీంద్ర అదే సమయంలో గుంటూరులోని ఓ సెలూన్‌లో ఉండగా, మరో ముద్దాయి రామకోటేశ్వరరావు హైదరాబాద్‌లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఇలాంటి తప్పుడు కేసుల్లో పోలీసుల తరుఫున డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ స్థాయి న్యాయాధికారి హాజరుకావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు వేరే ఉన్నాయని సుధాకరరెడ్డి పేర్కొన్నారు. రాకేష్‌గాంధీని కస్టడీకి తీసుకొని తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. భారతదేశంలో పోలీసుల ముందు ఇచ్చిన వాగ్మూలానికి చట్టబద్దత ఉండదని తెలిపారు. బీసీ మహిళ అయిన మాజీ మంత్రి విడదల రజినీని కేసులో ఇరికించి వేధించేందుకే పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్న ప్రతి కార్యకర్తను న్యాయపరంగా ఆదుకొనేందుకు, అరాచకాలను అడ్డుకొనేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి
సుదీర్ఘ వాదనలు
రాకేష్‌గాంధీకి బెయిల్ మంజూరు చేయాలని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. అతనిని పోలీసు కస్టడికి అప్పగించాలని డీడీవోపీ బర్కత్ అలిఖాన్ పోలీసుల తరఫున వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఆర్డర్లు జారీ చేస్తామని వెల్లడించారు.