రైతుకు దొంగల బెడద
తనిఖీలు ముమ్మరం చేస్తాం..
ఆరుగాలం కష్టపడి శ్రమించిన రైతును అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ఎండనక వాననక కష్టించి పండించిన పంటను కాపాడుకోవటానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలవుతున్నారు. నీరు లేక ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లకు దొంగల బెడద ఎక్కువైంది. పోలీసులకు చోరీలపై ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కోసం వేలల్లో చెల్లించలేక వారు పడుతున్న వేదన వర్ణనాతీతం.
మాచర్ల రూరల్ వ్యవసాయ భూముల్లో సాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగెలను దొంగలు చోరీ చేస్తున్నారు. మోటార్ ట్రాన్స్‌ఫార్మర్లను పగలకొట్టి రాగి తీగెలు అమ్ముకుంటున్న ఘటన మాచర్ల పట్టణ, మండల, గ్రామాల్లోని శివారు పొలాల్లో ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మాచర్ల పట్టణ శివారులోని పంట పొలాల రైతులు భవనం వెంకటరెడ్డి, ముక్కా సోమయ్య, కేశవరెడ్డి, రాయవరం గ్రామానికి చెందిన గోగుల లక్ష్మారెడ్డి, నాగెండ్ల నారాయణరెడ్డి, భీమా మట్టారావు, నారపుశెట్టి సాంబయ్య, తాళ్లపల్లి, కొప్పునూరు, కొత్తపల్లి తదితర గ్రామాలకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లను ధ్వంసం చేసి రాగి వైర్లను చోరీ చేసి అమ్ముకుంటున్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఉపయోగం లేదని వాపోతున్నారు.
ఒక్క రాయవరంలోనే 30 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ
ఒక్క రాయవరం గ్రామంలోనే సుమారు 30కి పైగా ట్రాన్స్‌ఫార్మర్‌లు చోరీకి గురికావటం గమనార్హం. దీంతో రైతులంతా ఒక్కసారిగా రూరల్ పోలీసుస్టేషన్‌ను చుట్టుముట్టారు. దొంగలపై చర్యలు తీసుకోండి.. లేకుంటే మేము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాం. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కోసం వేలకు వేలు విద్యుత్ శాఖాధికారులకు చెల్లించలేకపోతున్నాం. మమ్మల్ని ఆదుకోవాలంటూ అన్నదాతలు డిమాండ్ చేశారు.
పంటలను కాపాడుకోవటం ఎలా!
వరుసగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతుండడంతో మొక్కజొన్న, మిర్చి పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. పంటలకు అవసరమైన నీరును ఎలా పెట్టుకోవాలో అర్థం కాక రైతన్నలు మానసిక వేదనకు గురవుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలంటే విద్యుత్ శాఖాధికారుల వద్దనున్న బ్రోకర్లకు రూ. 50వేల నుంచి రూ.60వేల వరకు ఇస్తేనే ఏర్పాటు చేస్తున్నారు. పంట నష్టాన్ని కాపాడుకునేందుకు అప్పు చేసి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకున్నా వాటి రక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలును ఏర్పాటు చేసి చోరీలు నివారించాలని పోలీసులు కోరుతున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై పట్టణ, రూరల్ పోలీసులతో కలిసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామంలో కొత్త వ్యక్తుల కదలికలను తెలియజేయాలి. రైతుల తరపున విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
షేక్ నసీఫ్ బాషా, సీఐ, మాచర్ల రూరల్
రైతుకు దొంగల బెడద
రైతుకు దొంగల బెడద


