ముక్కోటికి మంగళాద్రి ముస్తాబు
మంగళగిరి టౌన్ : ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోపురం, ముఖ మండపం, కోనేరులకు చారిత్రక నేపథ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల కిందట ముఖ మండపం, 200 ఏళ్ల కిందట గాలి గోపురం నిర్మించారు. వీటికి తోడు 200 ఏళ్లనాటి దక్షిణావృత బంగారు శంఖం కూడా ఈ ఆలయంలో ఉంది. ఇది ఎంతో విశిష్టమైనది. ఏటా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణావృత బంగారు శంఖంతో లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తారు. పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మాడ వీధుల్లో బంగారు దక్షిణావృత శంఖు తీర్థం స్వీకరించేందుకు భక్తుల కోసం క్యూలైన్లు నిర్మించారు. ఈనెల 29న జగన్మోహిని అలంకారం, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామి దేవరుల సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారదర్శనం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
ముక్కోటికి ఆన్‌లైన్ సేవలు
ఈనెల 30న వైకుంఠ ఏకాదశి (ముక్కోటి)ని పురస్కరించుకుని స్వామి దర్శనార్థం ఆన్‌లైన్ సేవలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. టికెట్ పొందదలచిన వారు మొబైల్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఏపీ టెంపుల్స్ యాప్ డౌన్‌లోడ్ లేదా www. aptemples. org వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని తెలియజేశారు. ఆన్‌లైన్ టిక్కెట్లను టైమ్ స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలని, టికెట్‌తో పాటు ఆధార్ లేదా పాన్ కార్డ్ ఫొటోస్టాట్ కాపీలను దర్శనానికి వచ్చే సమయంలో వెంట ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 8500149595ను సంప్రదించాలని కోరారు.
ముక్కోటికి మంగళాద్రి ముస్తాబు


