అంగన్‌వాడీల యాప్‌సోపాలు
పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు సమయమేదీ...?
నెట్‌వర్క్ సరిగ్గా లేక, సర్వర్లు పని చేయక రోజంతా ఇక్కట్లు
మరో వైపు రికార్డులతో సతమతం
యాప్‌ల భారం తగ్గించాలని కోరుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీరు కారణంగా బోధన కుంటుపడుతుంది. పలు యాప్‌లతోపాటు 15 రకాల రికార్డులు నమోదు చేయాల్సి ఉంది. యాప్‌ల్లో వివరాలు నమోదు చేయాలంటే నెట్‌వర్క్ ఉండాలి. నెట్ వర్క్ పనిచేస్తే సర్వర్ పనిచేయదు. దీంతో యాప్‌ల్లో వివరాల నమోదుకు కుస్తీపడుతున్నారు. అధికారుల ఒత్తిడి, పనిభారంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సతమతమవుతున్నారు. సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు.
సత్తెనపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అంగన్‌వాడీల సమస్యలు పట్టించుకోలేదు. దీంతో సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు పోరుబాట పడుతున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, యాప్‌లతో ఆపసోపాలు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవల వివరాలన్నీ రికార్డుల్లో పొందుపరచడంతోపాటు ప్రత్యేక యాప్‌ల్లో ఎప్పటి కప్పుడు అప్‌లోడ్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్‌లో డైలీ అటెండెన్స్, వీహెచ్‌ఎన్‌డీ యాప్‌లో పిల్లల బరువులు, రిజిస్ట్రేషన్లు, హౌస్ విజిట్లు, హెల్త్ చెకప్‌లు, టేక్ హోమ్ రేషన్ వివరాలు నమోదు చేయాలి. ఇందు కోసం లబ్ధిదారుల ఫేస్ రీడింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బాల సంజీవిని యాప్, ఏడబ్ల్యూసీ డైలీ ట్రాకర్ వంటి యాప్‌లో వివరాల నమోదు కష్టతరంగా మారుతోందని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం, సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2,031 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలోని తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,010 అంగన్‌వాడీ కేంద్రాలు, 21 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2017 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 1,971 మంది అంగన్‌వాడీ సహాయకులు పనిచేస్తున్నారు. వీరిపై 67 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సూపర్‌వైజర్ పోస్టులు 16, అంగన్‌వాడీ కార్య కర్తల పోస్టులు 14, అంగన్‌వాడీ సహాయకుల పోస్టులు 60 ఖాళీగా ఉన్నాయి. వీరి భారం కూడా మిగిలిన వారిపై పడుతోంది. యాప్‌లలో వివరాలు నమోదు చేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలదే. నిర్ణీత సమయాల్లో యాప్‌లలో వివరాలను నమోదు చేయాలంటూ ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తుండడంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు యాప్‌లతోనే సమయం సరిపోతోంది. విద్యార్థులకు బోధనతోపాటు ఆటపాటలు నేర్పించే సమయం లేక అల్లాడుతున్నారు. ఉన్నతాధికారులు తనిఖీల పేరుతో వేధిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.
లబ్ధిదారుల ఫేస్ రీడింగ్, ఇతర వివరాల నమోదులో తిప్పలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించాల్సి ఉంటుంది. ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు యాప్‌లతో కుస్తీ పట్టడానికి, 15 రకాల రికార్డులు నిర్వహణకే సమయం సరిపోతోంది. చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ ప్రాథమిక విద్యాబోధనకు అడ్డంకిగా మారిన యాప్‌ల భారాన్ని తగ్గించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఇటీవల ఆందోళనలు నిర్వహించింది. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగుతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.


