జిల్లా వ్యవసాయాధికారి మురళి
నాదెండ్ల: రబీలో సాగైన కంది, శనగలను ప్రభుత్వం మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నందున ముందుగా రైతులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి చెప్పారు. సాతులూరులో రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప పంటలకు సాగునీరు లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంది మద్దతు ధర క్వింటా రూ.7550లు, శనగ రూ.5650లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్వరలో రైతు సేవా కేంద్రాల ద్వారా రెండు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ ఎం.శివకుమారి మాట్లాడారు. అనంతరం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించారు. నరసరావుపేట ఏడీఏ మస్తానమ్మ, ఏఓ హరిప్రసాద్, ఏఈఓలు బి.జీవన్‌నాయక్, వేణుగోపాల్, రామారావు, జీడీసీఎంఎస్ కొనుగోలు ఇన్‌చార్జి రామారావు పాల్గొన్నారు.