లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక! | - | Sakshi
Sakshi News home page

లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక!

Published Wed, Mar 19 2025 2:09 AM | Last Updated on Wed, Mar 19 2025 2:08 AM

గోల్డ్‌మెన్‌ పెరుమాళ్ల రాజేష్‌ కేసులో కొత్త మలుపు

పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో గోల్డ్‌మెన్‌ (గోల్డ్‌ బిస్కెట్ల విక్రయదారుడు) పెరుమాళ్ల రాజేష్‌ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పిడుగురాళ్ల పట్టణంతోపాటు చుట్టుపక్కల పట్టణాల్లోని పలువురు వ్యాపారుల వద్ద రూ.8 లక్షలు విలువ చేసే 100 గ్రాముల గోల్డ్‌ బిస్కెట్‌ను రూ.7లక్షలకు ఇస్తానని చెప్పి రూ.కోట్లు వసూళ్లు చేసి పట్టణం విడిచి పారిపోయిన ఘటన ఈనెల 11వ తేదీన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసుకొని బాధితులకు బిస్కెట్లు ఇవ్వకుండానే శ్రీలంకలో తలదాచుకున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

తెరపైకి టీడీపీ నేత చేబు పేరు..

ఈక్రమంలో టీడీపీ ఆర్యవైశ్య నాయకుడు చేబు సురేష్‌ పాత్ర తెరపైకి వచ్చింది. బంగారు బిస్కెట్‌లు తక్కువ ధరకు తీసుకొని వస్తానని మాయచేసి వ్యాపారులకు రూ.కోట్లు కుచ్చుటోపీ పెట్టిన రాజేష్‌ మిత్రుడే ఈ చేబు సురేష్‌. పెరుమాళ్ల రాజేష్‌ మార్చి 3వ తేదీ బోర్డు తిప్పేసి శ్రీలంక వెళ్లినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 28వ తేదీన పిడుగురాళ్ల పట్టణంలోని డీబీఎఫ్‌ బ్యాంక్‌లో తాను దాచుకున్న బంగారు, వెండి ఆభరణాలతో కూడిన రెండు గోతాలను రాజేష్‌ తన మిత్రుడైన చేబు సురేష్‌ వద్ద దాచి ఉంచాడన్న వార్త ఇప్పుడు పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే రాజేష్‌ కనిపించకుండా పోయినప్పటి నుంచి చేబు సురేష్‌ రాజేష్‌కు డబ్బు ఇచ్చిన మోసపోయినవారందరితో మీ అందరికీ న్యాయం చేస్తానని, అందుకు కోటికి రూ.లక్ష ఇస్తే పోలీసుల సహాయంతో పెరుమాళ్ల రాజేష్‌ను పట్టకొచ్చి డబ్బులు వసూళ్లు చేయిస్తానని బాధితులతో మాట్లాడి ఇప్పటికే సుమారు రూ.10 లక్షలు వసూళ్లు చేసినట్లు పలువురు బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండదండలు ఉన్నాయని, తన్ను నమ్మితే రాజేష్‌ను పట్టకొచ్చి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వచ్చేలా న్యాయం చేస్తానని చేబు సురేష్‌ బాధితులతో చర్చించాడనేది కొసమెరుపు.

తెరపైకి టీడీపీ నాయకుడు చేబు సురేష్‌ పేరు సురేష్‌ వద్దే రాజేష్‌ బంగారం, వెండి వస్తువులు దాచినట్లు ఆరోపణలు స్వాధీనం చేసుకున్న పోలీసులు! నిందితుడిని ఎలాగైనా పట్టిస్తానని బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన సురేష్‌!

బంగారు ఆభరణాల గోతాలు స్వాధీనం!

ఇదిలా ఉండగా బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయటంతో పిడుగురాళ్ల పట్టణ పోలీసులు కేసును మంగళవారం రంగంలోకి దిగారు. డీబీఎస్‌ బ్యాంక్‌కు వెళ్లిన పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన సీసీ ఫుటేజ్‌ పరిశీలించటంతో రాజేష్‌ మిత్రుడు సురేష్‌కు రెండు బంగారు ఆభరణాల గోతాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ విషయమై సురేష్‌ను పట్టణ పోలీసులు విచారించే కార్యక్రమం మొదలు పెట్టారు. అంతేకాకుండా రెండు గోతాల నగల గోతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెరుమాళ్ల రాజేష్‌ ముఖ్య అనుచరుడైన వందనపు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పెరుమాళ్ల రాజేష్‌ కోసం మూడు, నాలుగు బృందాలుగా పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. హైదరాబాద్‌, కోల్‌కత్తా, ఇతర ప్రాంతాల్లో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement