హైకోర్టు స్టే ఇచ్చినా..
● పెరుగుతున్న రొయ్యల మేత బస్తా ధరలు
● సిండికేట్ వ్యాపారంతో కుదేలు
● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
సంతబొమ్మాళి:
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాగు చేస్తున్న ఆక్వా రైతులకు కష్టాలు తప్పడం లేదు. రొయ్యల మేత ధరలు పెరుగుతుండటం.. రొయ్య ధరలు తగ్గుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు లక్షలు దాటుతున్నా లాభాలు మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతబొమ్మాళి మండలంలో నౌపడ, సీతానగరం, సెలగపేట, మర్రిపాడు, భావనపాడు, మూలపేట, కె.లింగూడు, సున్నాపల్లి, వడ్డీతాండ్ర, పోతునాయుడుపేట, యామలపేట, జగన్నాథపురం, ఉమిలాడ, ఆర్‌హెచ్‌పురం, ములగాం, కొల్లిపాడు, మరువాడ, మేఘవరం తదితర గ్రామాల్లో సమారు 1500 ఎకరాల్లో ఆక్వా సాగును చేపడుతున్నారు. జిల్లాలో 3300 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ప్రారంభంలో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉన్న తరువాత పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యల మేత కేజీకి ఒకసారి రూ.9, మరోసారి రూ. 8లు చొప్పున మొత్తం రూ.17 పెంచిన తయారీ సంస్థలు మరోసారి పెంచడానికి సిద్ధమవుతుండడంపై ఆక్వా రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి అధికం కావడం దానికి తోడు మేత, మెడిసిన్ రేట్లు పెరిగాయని, అదే సమయంలో రొయ్యల ధర మాత్రం తగ్గుతున్నాయని వాపోతున్నారు.
కలవరపెడుతున్న ధరలు..
సుమారు 15 సంవత్సరాల క్రితం మేత బస్తా రూ.850 ఉంటే 100 కౌంట్ కిలో రొయ్య ధర రూ.240 నుంచి రూ.260 మధ్యన ఉండేది. ఇప్పడు అదే మేత బస్తా రూ.2500 నుంచి రూ.2830కు పెరిగింది. 100 కౌంటు ధర మాత్రం రూ.210 నుంచి రూ.270 మధ్యే ఉండిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు రొయ్యల మేత బస్తా ధర రూ.2500 ఉండేది. మే, జూన్ రూ.2528, జూలై, ఆగస్టు, సెప్టెంబరులో రూ.2830 మేత థర ఉంది. జిల్లాలో రోజుకు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభైవేలు కేజీల మేతను ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. దీని విలువ మార్కెట్లో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల మధ్య ఉంటుందని ఆక్వా సంఘ నాయకులు చెబుతున్నారు.
రొయ్యల మేత ధరలు విపరీతంగా పెంచేసి సిండికేట్ వ్యాపారం చేయడంతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా బ్రహ్మయాప్ ద్వారా ఎప్పటికప్పుడు రొయ్యల ధరలు ఆన్‌లైన్ ద్వారా తెలిసేవి. ఇప్పుడు ఆ యాప్‌ను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో రొయ్యల ధర ఎంత ఉన్నది తెలియడం లేదు. మేత ధరలు విపరీతంగా పెరగడంతో కుదేలవుతున్నాం. – పాల వసంతరెడ్డి, ఆక్వారైతు,
హెచ్‌ఎన్‌పేట, సంతబొమ్మాళి మండలం
రొయ్యల మేత ధరలు కేజీకి రూ.17 పెంచారు. మేత ధరలు నిలుపుదలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ధరలను నియంత్రించలేదు. మూడు నెలలుగా విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. క్వాలిటీ రొయ్యల మేత అందించాలి. మేతక్వాలిటీ లేకపోవడంతో వైరస్ వ్యాప్తి చెంది ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది.
– కెళ్లి జగన్నాయకులు, ఆక్వా రైతు,
డోకి కామన్నపేట, సంతబొమ్మాళి మండలం
రొయ్యల మేత ధరలు పెంపును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మేత ధర పెంపుపై తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం ధరల పెంపు నియంత్రణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల మేత ధరల పెంపుపై అసోసియేషన్ తరఫున జిల్లా కలెక్టర్‌కు కూడా ఆక్వా రైతులు వినతి పత్రం అందజేశారు.


