రాయగడ: దీర్ఘకాల విరామం అనంతరం రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు మున్సిపాలిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 11 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఉపసంహరణ అవకాశం కల్పించారు. పోటీ ఉంటే మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల వరకు పొలింగ్ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
గత ఏడాది సెప్టెంబరు 12 వ తేదీన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్ర పండ పై 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. న్యాయపరమైన ప్రక్రియ, హైకోర్టు ఆదేశాల కారణంగా ఫలితాల ప్రకటన ఆలస్యమైంది. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 11 న అవిశ్వాస తీర్మానంపై ఓట్ల ఫలితాల్ని ప్రకటించారు. శుభ్రపండకు వ్యతిరేకంగా 19 ఓట్లు, అనుకూలంగా రెండు ఓట్లు నమోదయ్యాయి. దీంతో వైస్ చైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ పదవికి సీనియర్ కౌన్సిలర్ శ్రమితా పాడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గత 2022 మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం కూడా ఆమెకు వైస్ చైర్ పర్సన్ పదవి దక్కుతుందని ఎంతో ఆశించారు. అయితే అప్పట్లో అంతర్గత సమీకరణాల నేపథ్యంలో శుభ్ర పండ వైస్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పలువురు కౌన్సిలర్‌లు శ్రమితా పాడి కి మద్దతుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ ఉంటేనే తుది ఫలితాలు స్పష్టమవుతుంది. మరోవైపు కౌన్సిలర్లు అంతా ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్‌లో పాల్గొనేలా మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అవిశ్వాస తీర్మానం ఎందుకు..?
గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి విజయం సాధించిన శుభ్రపండ బీజేడీ టిక్కెట్టు పై పోటీ చేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి ఆశీర్వాదంతో రాయగడ మున్సిపాలిటీలో గల 24 వార్డులకు గాను 21 బీజేడీ కౌన్సిలర్లు దక్కించుకున్నారు. అనంతరం వైస్ చైర్మన్ గా నెక్కంటి కృషి ఫలితంగా శుభ్ర పండ ఎంపికయ్యారు. బీజేడీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆ పార్టీకి నెక్కంటి రాజీనామా చేసి బిజు స్వాభిమాన్ మంచ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో నెక్కంటిని శుభ్ర వ్యతిరేకిస్తూ వచ్చారు. నెక్కంటి భాస్కరరావు వ్యతిరేక వర్గానికి మద్దతు పలుకుతూ వచ్చారు. దీంతో నెక్కంటి చక్రం తిప్పారు. అనంతరం 19 మంది కౌన్సిలర్లు శుభ్రపండ పనుల తీరును నిరసిస్తూ అవిశ్వాస తీర్మాణాన్ని తీసుకువచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించినా పదవిని కాపాడుకోలేకపోయారు. ఈ నెల 29 తేదీన జరగనున్న వైస్ చైర్మన్ పదవికి శ్రమిత పాడి రంగంలో దిగనున్నట్లు భోగట్టా.


