భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ కార్యకలాపాలకు శుక్రవారం వరుసగా నాలుగో రోజు కూడా అంతరాయం కలిగింది. ఎంఎండీఆర్ సవరణ చట్టం–2026, పాఠశాల పాఠ్యపుస్తకాల వివాదంపై నినాదాలు చేస్తూ ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ సభ్యులు సభా మధ్యలోకి దూసుకెళ్లడంతో ఈ పరిస్థితి తాండవించింది. ఈ గందరగోళం మధ్య డిప్యూటీ స్పీకర్ భబానీ శంకర్ భోయ్ సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. సభ వాయిదా పడడంతో విపక్ష సభ్యులు బయటకు తరలి వచ్చి నిరసన నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రశ్నోత్తరాలు ఆరంభం కావడంతో అంతరాయం మొదలైంది. పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ సమాధానం చెప్పాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి ప్రవేశించి నినాదాలు చేయడంతో, సభా కార్యకలాపాలకు ముందుకు సాగలేదు. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులపై బిజూ జనతా దళ్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ వివాదానికి విభాగం మంత్రి నిత్యానంద గోండ్‌ను బాధ్యుడిగా పేర్కొంటూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, కాంగ్రెస్ సభ్యులు ఎంఎండీఆర్ సవరణ చట్టం, 2026 అంశాన్ని లేవనెత్తి, ఈ చట్టాన్ని ఒడిశాలో అమలు చేయవద్దని డిమాండ్ చేశారు.


