● బైక్‌పై కూర్చున్నట్లు నటించి మారు తాళాలతో జంప్ ● 10 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 8, పార్వతీపురం–మన్యం జిల్లాలోని పాలకొండ పీఎస్ పరిధిలోని 2 ద్విచక్రవాహనాలను దొంగిలించిన నిందితుడు ఎట్టకేలకు పోలీసు బృందాలకు పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం ఆదివారంపేట కూడలి వద్ద సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ హేమంత్ కళ్యాణ్, సిబ్బంది రికార్డుల తనిఖీ నిమిత్తం ద్విచక్రవాహనాలను ఆపుతుండగా అదే సమయంలో బైక్‌పై వస్తున్న పాత్రునివలస టిడ్కో కాలనీకి చెందిన యాగంటి సంతోష్‌కుమార్‌ను ఆపారు. రికార్డులు సరిగా లేకపోవడం గుర్తించి ఫింగర్‌ప్రింట్ తనిఖీ చేయడంతో పాత నేరస్థునిగా చూపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. రద్దీ ఏరియాల్లో బైక్‌పార్కింగ్ వద్దకు వెళ్లి వాటిపై కూర్చున్నట్లు నటించి మారు తాళాలతో అక్కడి నుంచి ఉడాయించడం సంతోష్ నైజమని డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటుపడ్డాడని, డబ్బుల కోసం బైక్ చోరీలను అస్త్రంగా మార్చుకున్నాడని వివరించారు. కొట్టేసిన బైక్‌లను ఆదిత్యపార్క్ పరిసర ప్రాంతాల్లో పెట్టి తనకు డబ్బులు అవసరమైనప్పుడు అమ్మేందుకు యత్నిస్తాడని తెలిపారు. ఈ క్రమంలోనే రెండో పట్టణ పోలీసులకు పట్టుబడినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెఉలిపారు. సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐలు హేమంత్‌కళ్యాణ్, హైమావతి, సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.


