భువనేశ్వర్: జాతీయ చలన చిత్ర పురస్కారం గెలుచుకున్న ఒడియా చిత్రం లహరి నిర్మాత ఝిలిక్ భట్టాచార్జీ ఆధ్వర్యంలో చిత్ర బృందంలోని ఇతర సభ్యులు గురువారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని కలిశారు. ఈ సందర్భంగా స్థానిక లోక్ భవన్‌లో గవర్నర్ చిత్ర బృందానికి అభినందించారు. చిత్ర బృందంతో గవర్నర్ ముచ్చటించి.. లహరి జాతీయ చలన చిత్ర పురస్కారం అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. వారి కృషిని ఆయన ప్రశంసించి భవిష్యత్ ప్రయత్నాలలో వరుస విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అర్థవంతమైన, ప్రభావవంతమైన చిత్రాల నిర్మాణంతో యువతరాన్ని ప్రేరేపించి సానుకూల ప్రభావం చూపడంలో ప్రధాన మాధ్యమంగా సద్వినియోగపరచుకోవాలని లహరి చిత్ర నిర్మాతలను గవర్నర్ ప్రోత్సహించారు.
నేడు పాఠశాలలకు సెలవు
పర్లాకిమిడి: ఈ నెల 25వ తేదీన గజపతి జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ మయాధర్ సాహు గురువారం ఒక ప్రకటనలో సెలవు ప్రకటించారు. గజపతి జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎస్.ఎస్.డీ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
పాము కాటుతో యువకుడి మృతి
రాయగడ: పాము కాటు వేయడంతో యువకుడు మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియాపొదొరొ గ్రామానికి చెందిన మనోజ్ బిడిక (17)గా గుర్తించారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇంటిలో నిద్రించే సమయంలో పాము కాటువేసింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఉద్దానంలో తాగునీరు బంద్
వజ్రపుకొత్తూరు: పూండి ఉద్దానం మంచినీటి పథకం పంపింగ్ కేంద్రం నుంచి గురువారం తాగునీటి సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. హరిదాసుపురం, కణితివూరు, గోవిందపురం, పీవీపురం తదితర గ్రామాలకు తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అరసవల్లి: జిల్లా పరిషత్ పాలకుల పదవీకా లం గురువారం సాయంత్రంతో ముగియడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. గురువారంతో జెడ్పీ చైర్‌పర్సన్ విజయతో పాటు మిగిలిన జెడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో జిల్లా పరిషత్ పరిపాలన బాధ్యతలన్నీ కలెక్టర్ నేతృత్వంలోనే కొనసాగనున్నాయి. కొత్త పాలకవర్గం బాధ్యతల్లోకి వచ్చేంత వరకు ఈ పరిస్థితి కొనసాగు తుంది. కాగా జిల్లాల పునర్విభజన కారణంగా రాజాం నియోజకవర్గంలో నాలుగు మండలా లు విజయనగరం జిల్లా పరిషత్‌లోకి, పాలకొండ నియోజకవర్గంలోని 4 మండలాలు కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. మిగిలిన 8 నియోజకవర్గాల్లోని 30 మండలాలతో స్థానిక జిల్లా పరిషత్‌కు ప్రత్యేకాధికారి పాలన గురువా రం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యింది.
మూడేళ్ల చిన్నారికి ముద్దులిచ్చి..
ఇబ్రహీంపట్నం: మూడేళ్ల చిన్నారి కూతురికి ముద్దులిచ్చి.. ఉరివేసుకొని ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..శేరిగూడకు చెందిన సిద్ధని సునీత (23)ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన దిలీప్‌కి ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి మూడేళ్ల కూతురు ఉండగా ప్రస్తుతం ఆమె గర్భిణి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త, అత్తింటి వారి వేధింపులతో సతమతమవుతోంది. 20 రోజుల క్రితం భర్తతో గొడవపడి అమ్మగారింటికి శేరిగూడకు వచ్చింది. ఏమైందోఏమోగాని గురువారం తల్లి హాల్‌లో కూర్చొని ఉండగా కూతురిని బెడ్‌రూంలోకి తీసుకెళ్లి ముద్దులిచ్చింది. తర్వాత ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


