రాయగడ:
జిల్లా కాంగ్రెస్‌లో శంకర్ జిలకరను చుట్టుముట్టిన చర్చకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీకి, జిల్లా ఆదివాసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన గతంలో సమర్పించిన రాజీనామాను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తిరస్కరించింది. దీంతో గతంలో నిర్వహించిన బాధ్యతలను మళ్లీ చేపట్టాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ యశ్వంత్ నారాయణ్ సింగ్ లాగూరి ఈ మేరకు సెప్టెంబర్ 17న జిలకరకు లేఖ ద్వారా సమాచారం అందించారు. 2024 ఫిబ్రవరి 1న శంకర్ జిలకరను రాయగడ జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం అదే ఏడాది మే 5న జిల్లా కాంగ్రెస్ కమిటీ అదనపు అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో పార్టీ సంస్థాగత బాధ్యతలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో రాయగడ జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఒక ఎంపితో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే అనంతరం జిలకరను అదనపు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ఈ ఏడాది జనవరి 12న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆదివాసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను పీసీసీ అధ్యక్షుడు గానీ.. రాష్ట్ర ప్రదేశ్ ఆదివాసీ కాంగ్రేస్ కమిటీ గానీ ఆమోదించలేదు. ఈనెల 21న రాయగడలో జరిగిన ఇండీ కూటమి పరివర్తన్ ర్యాలీ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ జిలకరతో చర్చించారు. అనంతరం రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ నుంచి లేఖ జారీ చేసి ఆయన రాజీనామాను తిరస్కరించినట్లు, గతంలో మాదిరిగానే బాధ్యతల్లో కొనసాగాలని సూచించింది. ఆ లేఖలో జిలకరను పార్టీకి చెందిన ముఖ్యమైన సభ్యుడిగా పేర్కొన్నారు. రాజీనామా తిరస్కరణ అనంతరం జిలకర మళ్లీ పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రానున్న రోజుల్లో రాయగడ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని జిలకర తెలియజేశారు.


