రాయగడ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాయగడ–కొరాపుట్ రైలు మార్గంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. లిల్లిగుమ్మ–రౌలి స్టేషన్ల మధ్య పలు ప్రాంతాల్లో స్వల్పంగా మట్టి జారిపతుండటంతోపాటు లక్ష్మీపూర్ రోడ్ స్టేషన్ సమీపంలోనూ మట్టి జారినట్లు గుర్తించారు. టన్నల్ నంబర్ 3 సమీపంలో స్వల్పంగా కొండచరియలు జారినట్లు ఆనవాళ్లు కనిపించగా, టన్నల్ నంబరు 2లో నీటి లీకేజీ, ఊటలు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాయగడ రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ సింఘాల్.. సీనియర్ డివిజనల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందితో కలసి భారీ వర్షంలోనూ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పునరుద్ధరణ, భద్రతా చర్యలను సమీక్షించి సిబ్బంది అప్రమత్తతం చేశారు. వర్షాల ప్రభావానికి గరయ్యే ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైళ్ల రాకపోకలు, ప్రయాణికులు, రైల్వే మౌలిక వసతుల భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా టన్నల్స్, కొండ కొతలు, రైల్వే ఎంబాంక్‌మెంట్లు, మట్టి జారే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్, ఫీల్డ్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో మోహరించి, వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టారు. నిర్ధేశిత భద్రతా ప్రమాణాల ప్రకారం ముందస్తు చర్యలు, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయని డీఆర్‌ఎం సింఘాల్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని డివిజన్ స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ.. అవసరమైన ప్రాంతాల్లో పనులను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు చెప్పారు.


