మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలి
టెక్కలిలో గిరిజన వసతి గృహం వద్ద దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ధర్నా
టెక్కలి:
రైలు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు చొప్పున పరిహారం అందించాలని దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం టెక్కలి గిరిజన బాలుర వసతి గృహం వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వార్డెన్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు మృతి చెందారని మండిపడ్డారు. విద్యార్థుల కుటుంబాలను ఆదుకునేలా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. వార్డెన్ సుదర్శన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాల్మన్‌రాజుకు మెరుగైన వైద్యంతో పాటు ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఈ ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల భద్రత, వసతి గృహాల పర్యవేక్షణ విషయంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్, పీఓల పాత్రపై సమగ్ర విచారణ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దుర్గాసి గణేష్, బెలమర ప్రభాకర్, కె.ధర్మారావు, వై.గోపి, గేదెల రమణయ్య, కె.శ్రీను, చల్లా రామారావు, పి.దినేష్, టి.సూర్యం, వైకుంఠరావు, జె.సింహాచలం, ఎల్.రామచంద్రరావు, బి.గోవిందరావు, కె.జగ్గారావు, ఎ.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులంటే ప్రభుత్వానికి చిన్నచూపు
సారవకోట: గిరిజనులపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టెక్కలి గ్రామ సమీపంలో బుధవా రం రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు గిరిజన విద్యార్థులు మృతి చెందినప్పటికీ సంఘటనక్థీలాన్ని పరిశీలించి గిరిజనులను ఓదార్చేందుకు ప్రభుత్వ పెద్దలు, ఐటీడీఏ అధికారులకు తీరిక లేదని దుయ్యబట్టారు. వసతి గృహంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలిందన్నారు. వారిని ఐటీడీఏ ద్వారా ఆదుకోవాల్సి ఉన్నా ప్రభుత్వం అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుందని ఆరోపించారు.


