కొరాపుట్: భారీ వర్షానికి కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలు తడిచిముద్దయ్యాయి. గురువారం రోజంతా భారీ వర్షం కురిసింది. ఇరు జిల్లాలలో రాకపోకలు నిలిచిపోయాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రాత్రిపూట బస్సులను రద్దు చేశారు. ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు బస్సు సేవలు నిలిచిపోయాయి. మరోవైపు రైల్వే విభాగం కొరాపుట్ వైపు విశాఖపట్నం నుంచి రైళ్లని రద్దు చేసింది. కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్, నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ రాత్రింభవళ్లు పరిస్థితి సమీక్షిస్తున్నారు. నబరంగ్‌పూర్ నుంచి డాబుగాం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నందాహండిలో ఇళ్లు కూలిన బాధితులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. తెంతుల కుంటిలో నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నందపూర్ ఇళ్లు కూలిపోయిన ప్రాంతాలను అధికారులు సందర్శించారు.


