సత్కార సభలో జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ భావోద్వేగం
అరసవల్లి: జిల్లా పరిషత్ చరిత్రలో అత్యంత పారదర్శకపు పరిపాలన అందించి ఐదేళ్ల పాలనలో అవినీ తి మరక అంటకుండా పాలించిన జెడ్పీ అధ్యక్షురా లిగా పిరియా విజయ చరిత్రలో నిలిచిపోతారని పంచాయతీరాజ్ ఉద్యోగులు కొనియాడారు. గురువారంతో చైర్‌పర్సన్ పదవీకాలం ముగియడంతో విజయను పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ ఉద్యోగులు గురువారం ఘనంగా సత్కరించారు. పదవీకాలంలో అందించిన సేవలే మంచి గుర్తింపునిచ్చా యని సీఈవో ఆర్.వెంకట్రామన్ కొనియాడారు. పీఆర్ డిప్లమో ఇంజినీర్ల సంఘ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి మాట్లాడుతూ..పదవికి వన్నె తెచ్చిన మహిళగా విజయమ్మ గుర్తింపు పొందారని చెప్పారు. పీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు కిల్లారి నారాయణరావు మాట్లాడుతూ పారదర్శకంగా పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలను చేపట్టిన ఘనత విజయమ్మకే దక్కుతుందన్నారు. అనంతరం విజయ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా చివరి ప్రసంగం అదే శాఖ ఉద్యోగుల నడుమ జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనస్సాక్షిని నమ్ముకుని పరిపాలన చేశానని..ఇందులో తోటి జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటే...కీలక పాత్ర పీఆర్ ఉద్యోగులదేనని పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు పదవి కట్టబెడితే.. మంచి పేరు తెచ్చుకున్నానన్న తృప్తితో వెళ్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ యూనిట్ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, వివిధ మండలాల ఎంపీడీవోలు, రిటైర్డ్ ఎంపీడీవోలు పాల్గొన్నారు.


