న్యూస్‌రీల్
గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విపత్తును..
● అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి ● రాష్ట్రంలో విపత్తు నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్ష
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం కారణంగా కురుస్తున్న వర్షాల ప్రభావంపై ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ బుధవారం స్థానిక లోక్ సేవా భవన్‌లో సమీక్షించారు. సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌కుమార్ పూజారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక సహాయక కమిషనర్ తదితరులు హాజరయ్యారు. తీవ్ర అల్పపీడనం, భారీ వర్షాలు కురిసే అవకాశం, పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేక సహాయ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకృతి వైపరీత్యాల్లో శూన్య ప్రాణహాని ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దిశలో విపత్కర పరిస్థితుల్ సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖలన్నీ జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. జలమయమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుఫాను వచ్చే అవకాశం లేనప్పటికీ, అత్యున్నత స్థాయిలో సన్నద్ధంగా ఉండి, అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తీవ్ర అల్ప పీడనం కారణంగా బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25 తర్వాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్నారు.
సహాయక, పునరుద్ధరణ బృందాల మోహరింపు..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 33 యూనిట్ల ఒడిశా విపత్తు సహాయ స్పందన దళం (ఒడ్రాఫ్) బృందాలను మోహరించారు. గంజాంలో 6, గజపతిలో 3, కొరాపుట్‌లో 6, మల్కన్‌గిరిలో 3, రాయగడలో 3, కలహండిలో 2, బొలంగీర్‌లో ఒక యూనిట్‌ను మోహరించారు. గంజాం జిల్లా ఛత్రపూర్‌లో అదనంగా 9 యూనిట్ల ఒడిశా విపత్తు సహాయ స్పందన దళం (ఒడ్రాఫ్) బృందాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో అన్ని ఓడ రేవులలో 3వ నంబరు స్థానిక హెచ్చరిక సంకేతం ఎగుర వేశారు. గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్, కలహండి జిల్లాలు అత్యధికంగా, నువాపడా, బొలంగీర్, కంధమల్, పూరీ, ఖొర్ధా, నయాగడ్ జిల్లాలు సాధారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని స్థానిక జిల్లా యంత్రాంగాలు, రెవెన్యూ శాఖ అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ, విద్యుత్, వాణిజ్య, రవాణా, నిర్మాణాలు, వ్యవసాయం, రైతుల సాధికారత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రెడ్ అలెర్ట్..
రాయగడ, కొరాపుట్, గజపతి, గంజాం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు గరిష్టంగా గంటకు 70 కిలో మీటర్ల వరకు వేగం పుంజుకునే ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలెర్ట్
నువాపడా, బొలంగీర్, కలహండి, కంధమల్, నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి, పూరీ, ఖొర్ధా, నయాగడ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఎల్లో అలెర్ట్
బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, జగత్‌సింగ్‌పూర్, కటక్, బరగడ్, సంబల్‌పూర్, దేవగడ్, అనుగోలా, ఢెంకనాల్, కెందుఝర్, మయూర్‌భంజ్, సువర్ణ పూర్, బౌధ్‌లలో ఎల్లో అలెర్ట్ హెచ్చరిక జారీ అయింది.


