బీఆర్‌ఎస్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సమావేశం

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

ఎచ్చెర్ల: బీఆర్‌ఏయూలో బోర్డ్‌ ఆఫ్‌ టీచర్స్‌ రీసెర్చ్‌ స్టడీస్‌ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. పీహెచ్‌డీ గైడ్స్‌ గుర్తింపు, రెన్యూవల్‌కు సంబంధించిన అర్హతలపై ఈ సమావేశంలో సమీక్షించారు. గైడ్స్‌ కేటాయింపులో వచ్చిన ఫిర్యాదులు, లోపాలు, ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీ కింద విద్యార్థుల ప్రవేశం, రీసెర్చ్‌ సెంటర్లకు సంబంధించిన అంశాలను చర్చించారు. సమావేశంలో వీసీ కేఆర్‌ రజనీ, రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేయాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు, నిత్యావసర వస్తువులు, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని జిల్లా సముద్ర తీర మత్స్య కార్మికుల యూనియన్‌ అధ్యక్షుడు మూగి రామారావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించడం బాగానే ఉన్నప్పటికీ.. రోజువారీ వేటపై ఆధారపడే శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మత్స్యకార కుటుంబాల ఆదాయం లేక ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. గ్రామాల వారీగా ప్రభావిత కుటుంబాలను గుర్తించి, పారదర్శకంగా ప్రత్యేక జాబితా రూపొందించాలన్నారు. అర్హులైన కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని నేరుగా, జాప్యం లేకుండా జమ చేయాలన్నారు. సహాయం పంపిణీలో వివక్ష, అవకతవకలు, జాప్యం నివారించేందుకు మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

పుస్తెలతాడు చోరీ కేసులో నలుగురు అరెస్టు

మందస: పుస్తెలతాడు చోరీ కేసులో ఒడిశాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వరదరాజపురం గ్రామంలో ఇటీవల జరిగిన చైన్‌ స్నాచింగ్‌ కేసుకు సంబంధించి సోమవారం సాయంత్రం కొత్తపల్లి జాతీయ రహదారి సమీపంలో ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. వీరు బరంపురం పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో మేసీ్త్రలుగా పనిచేసేవారు. వీరు దగ్గర హెల్పర్లుగా అక్కాచెల్లెలు పనిచేశారు. పరిచయం ఎక్కువై వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నారు. అనంతరం విలాసాలకు గురై గత ఆరు నెలలుగా ఈ దొంగతనాలు చేస్తున్నారు. పుస్తెలతాడు అమ్మడానికి ద్విచక్ర వాహనాల్లో పలాస వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.

పాముకాటుతో మహిళ మృతి

సంతబొమ్మాళి: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తంగి సీతమ్మ (60) పాటుకాటుకు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. రెండు రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన ఆమె పాముకాటుకు గురైంది. అనంతరం కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌: మెళియాపుట్టి మండలం లింగుపురం గ్రామం సమీప రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బందపల్లి గ్రామానికి చెందిన జి.వాసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వాసు తన ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వస్తుండగా లింగుపురం వద్ద వెనుక నుంచి వచ్చిన బొలేరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన వ్యక్తిని హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఘటనపై మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించారు.

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని ధనుకువాడ గ్రామానికి చెందిన చిన్నాల విశ్వనాథం ఈనెల 20వ తేదీ నుంచి కనపించడం లేదని భార్య చిన్నాల శారద ఫిర్యాదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కొంతమంది గ్రామస్తులకు ఎల్‌.ఎన్‌.పేట జంక్షన్‌లో కనిపించాడని చెప్పడంతో సీసీటీవీ ఫుటేజీను పరిశీస్తునట్లు తెలిపారు. విశ్వనాథంకు భార్య శారద, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement