● ధ్వజమెత్తిన సీపీఎం నాయకులు ● జోరువానలో ర్యాలీగా వెళ్లి జేసీకి వినతి అందజేత
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టవా అని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నారాయణపురం భూసాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ రెండోరోజు మంగళవారం కుశాలపురం నుంచి జోరువానలో తడుస్తూ మహిళలు, వృద్ధులు, రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న భూసాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. 50 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం సందర్భంగా ఈ పాదయాత్ర ఒక మైలురాయి అని అభివర్ణించారు. తప్పుడు పత్రాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ అండదండలతో భూకబ్జాదారులు రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రకు విద్యార్థి, కార్మిక, మహిళా, ప్రజా సంఘాలు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎన్.వి.రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, నారాయణపురం భూసాగుదారుల పోరాట కమిటీ నాయకులు తోనంగి నందోడు, కోరాడ అప్పన్న, పుట్టా కవిలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


