భువనేశ్వర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సోమవారం స్థానిక లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని కలిశారు. ఈ సందర్భంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న చిరకాల సామాజిక, సాంస్కృతిక సంబంధాలపై ఇరువురు చర్చించుకున్నారు. వివిధ రంగాలలో అభివృద్ధి, సహకారంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపైన, పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు, సహకారం, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలకు నిరంతర సంప్రదింపులు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. దీర్ఘకాలంగా ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న మహా నదీ జలాల పంపిణీ వివాదాన్ని సమారస్యంగా పరిష్కరించేందుకు సన్నాహాలు చురుకుగా కొనసాగుతున్న తరుణంలో వీరివురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


